రాష్ర్టానికి ఈశాన్య రుతుపవనాలు తాకేసాయి. ఆషాఢ మాసం వచ్చేసింది. అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యమంత్రి గజన్ మోహన్ రెడ్డి రైతు భరోసా కూడా అకౌంట్ లో పడిపోయింది. ఇక దుక్కి దున్నాలి. విత్తనాలు వేయాలి. పంటలు పెంచాలి. ఇదే ఇప్పుడు రైతులు ముందున్న టార్గెట్. రాష్ర్టంలో రైతులంతా ఇవే పనుల్లో తలమునకలై ఉన్నారు. అయితే నేను రైతునే అంటూ ఓ వైకాపా ఎంపీ వ్యవసాయంపై తన అభిమానాన్ని ఇలా చాటుకున్నారు.
పొలంలో ఎడ్లకు నాగలి కట్టి దుక్కి దున్నుతూ ఇలా కెమెరా కంటికి చిక్కారు. అసలే రైతన్న రాజ్యం. ఆ రాజ్యంలో అధికారంలో ఉన్న లేడీ ఎంపీ నాగలి పట్టడామాయే. ఇంకే ముందు కావాల్సినంత ప్రచారం దొరికేసింది. ఇంతకీ ఎవరా లేడీ ఎంపీ ? వ్యవసాయంపై అంతగా మక్కువ చూపించడానికిగల కారణాలు ఏంటి? అంటే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తన సొంత నియోజక వర్గంలోనే ఉన్నారు. తండ్రి మాజీ ఎమ్మెల్యే గుడి దేవుడుకి వ్యవసాయం అంటే పిచ్చి. ఆయన ద్వారా సంక్రమించిన అలవాటే మాధవిని ఇలా నాగలి పట్టేలా చేసింది. నెత్తికి టోపీ..మెడలో పార్టీ కండువా వేసి మాధవి నాగలి పట్టి దుక్కి దున్నుతున్నారు. ఎడ్లను తనదైన భాషలో బెదిరిస్తూ నాగలితో చాళ్లు వేస్తున్నారు.
తమకున్న భూముల్లో ఖాళీ సమయాన్ని వ్యవసాయ పనులకు కేటాయిస్తారుట. పొలంలో పనులు జరుగుతుంటే వెళ్లి పర్యవేక్షించడం అలవాటుట. ఇంకా సమయం దొరికితే స్వయంగా రంగంలోకి దిగుతారుట. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయ నాయకురాలిగా, ఎంపీగా ఎదిగినా మూలాలు మర్చిపోకుండా పొలం పనులు చేయడం నిజంగా గొప్ప విషయమే. నాగలి పట్టి దుక్కి దున్నేవారికే కదా! రైతు వ్యథలు తెలిసేవి. మొత్తానికి ఎంపీ మాధవి కొందరికి ఆదర్శనమనే చెప్పాలి. ప్రస్తుతం మాధవికి సంబంధించిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.