వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ మీద పట్టు బిగిస్తున్నారా, సొంత పార్టీ నేతలను కూడ ఖాతరు చేయట్లేదా అంటే అవుననే అంటున్నాయి విశాఖ వైసీపీ వర్గాలు. జగన్ గతంలో జిల్లాలను విభజించి ముగ్గురు సజ్జల, వైసీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆ పంపకాల్లో విశాఖ బాధ్యతలు విజయసాయిరెడ్డి చేతికి వెళ్లాయి. మొదటి నుండి విశాఖ రాజకీయాలను గుప్పిటిలో పెట్టుకోవాలని చూస్తున్న విజయసాయిరెడ్డికి జగన్ పూర్తి హక్కులు ఇచ్చేశారు. దీంతో అక్కడి ప్రతి అంశాన్ని విజయసాయిరెడ్డే నడిపిస్తున్నారు.
విశాఖలో సింహాచలం పంచ గ్రామాల భూసమస్య చాలా కాలం నుండి కొనసాగుతూనే ఉంది. కొందరు రాజకీయ నేతలు దేవస్థానం భూములను పెద్ద ఎత్తున ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి అధ్యక్షతన ఉండే ఈ కమిటీలో అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్‌రాజ్, సీఎం ప్రధాన సలహాదారు, జిల్లా కలెక్టర్, దేవస్థానం ఈఓ సభ్యులుగా ఉండేవారు. ఈ కమిటీలోకి కొత్తగా ఇంకో ముగ్గురిని చేర్చారు. వారిలో విజయసాయిరెడ్డి, దేవాదాయ కమీషనర్, ఎంపీ సత్యవతి ఉన్నారు. అయితే విజయసాయిరెడ్డి పేరు చేర్చడం మీదనే అభ్యంతరాలు వ్యక్తవమవుతున్నాయి.
విజయసాయిరెడ్డికి జగన్ పార్టీ తరపున మాత్రమే విశాఖ బాధ్యతలు అప్పగించారు. అంతేకానీ ప్రభుత్వం పరంగా ఆయనకు, విశాఖకు ఎలాంటి సంబంధం లేదు. పార్టీ పనులేవైనా ఆయన ఇష్టం మీదనే జరుగుతాయి. వాటికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఇలా ప్రభుత్వ వ్యవహారాల్లో కూడ ఆయన జోక్యం ఏమిటని లోకల్ లీడర్లు నొచ్చుకుంటున్నారు. ప్రభుత్వం కొత్తగా చేర్చిన సభ్యుల్లో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేరు ఎందుకు లేదని, ఎలాంటి సంబంధం లేని విజయసాయిరెడ్డి పేరును చేర్చాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నారు. టీడీపీ నేతలైతే నేరారోపణలున్న విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించడం సమంజసం కాదని అంటున్నారు. ఇంకోవైపు ఎంపీ సత్యనారాయణ వర్గం కూడ ఇది పక్కా డామినేషన్ అనే అంటున్నారట.