కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ప్రభుత్వం విధించాల్సిన లాక్ డౌన్ కంటే ముందే టాలీవుడ్ లాక్ డౌన్ పెట్టేసుకుంది. ఎక్కడి షూటింగ్స్ అక్కడే ఆగిపోయాయి. విడుదలలు నిలిచిపోయాయి. థియేటర్లు మూతబడటంతో అన్ని సినిమాలు కొత్త రిలీజ్ డేట్స్ కోసం వెతుక్కుంటున్నాయి. కానీ పరిస్థితులు చూస్తే సినిమా హాళ్లు ఇప్పుడప్పుడే తెరుచుకునేలా లేవు. దీంతో సినిమాల నిర్మాతలు ఓటీటీల వైపు దృష్టి సారిస్తున్నారు. ఫైనాన్స్ తెచ్చి సినిమాలు చేస్తే నేలల తరబడి అవి రిలీజ్ కాకుండా నిలిచిపోతే ఎలాగని భావించిన కొందరు నిర్మాతలు ఓటీటీలను అప్రోచ్ అవుతున్నారు. దీంతో పలు సినిమాల రిలీజ్ విషయంలో పుకార్లు వినబడుతున్నాయి.
కొన్ని సినిమాలు ఓటీటీల్లోకి వెళ్లిపోతున్నాయని ప్రచారం మొదలైంది. వాటిలో రానా నటించిన ‘విరాటపర్వం’ కూడ ఉంది. ఈ సినిమా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గరపడే సమయానికి థియేటర్లు క్లోజ్ అయ్యాయి. దీంతో మేకర్స్ ఓటీటీలోకి వెళ్లాలని చూస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ వాటిలో నిజం లేదు. ఎందుకంటే సినిమా థియేట్రికల్ హక్కులు ఎప్పుడో అమ్ముడైపోయాయి. టీజర్ ఆకట్టుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లు త్వరపడి హక్కులు కొనేశారు. ఇప్పుడిక నిర్మాతలకు ఓటీటీల్లోకి వెళ్ళాలని ఉన్నా అది కుదరదు.
కాబట్టి ఏది ఏమైనా సినిమాను ముందుగా థియేటర్లలోనే విడుదల చేసి తీరాలి. ఆ తర్వాతనే ఓటీటీల్లో రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది.