విరాట్ కోహ్లీ ఇంత పెద్ద షాక్ ఇచ్చాడేంటి చెప్మా.?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డేలు అలాగే టీ20లకు ఇకపై కెప్టెన్సీ చేయడు.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడు.. ఈ మేరకు బీసీసీఐకి సమాచారం కూడా ఇచ్చాడు.. ఇదీ కొద్ది రోజుల క్రితం తెరపైకొచ్చిన ఓ గాసిప్. తూచ్, అదంతా ఉత్తదేనని బీసీసీఐ స్పష్టం చేసింది. అవన్నీ ఉత్త రూమర్లేనంటూ బీసీసీఐ పెద్దలు వివరణ ఇచ్చుకున్నారు. అయితే, టీ20 వరల్డ్ కప్ తర్వాత తాను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాననీ, వన్డేలు అలాగే టెస్టులకు మాత్రం కెప్టెన్సీ చేస్తానని విరాట్ కోహ్లీ అధికారికంగా ప్రకటించేశాడు. సుదీర్ఘ కాలం కెప్టెన్సీ చేశాననీ, ఈ క్రమంలో తనపై ఒత్తడి విపరీతంగా పెరిగిపోయిందనీ, ఆ ఒత్తిడిని కాస్త తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నాననీ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అతనెవరో కాదు, రోహిత్ శర్మ. అయితే, విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీని కూడా వదులుకుంటున్నట్లు ప్రకటించి వుంటే బావుండేదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మరోపక్క, విరాట్ కోహ్లీ నిర్ణయం బాధించిందంటూ అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. ఇటీవలి కాలంలో కెప్టెన్సీ కారణంగా పెరిగిన ఒత్తిడితో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నుంచి అద్భుతాలేమీ కనిపించడంలేదు. నిజానికి, చాలా వైఫల్యాల్ని విరాట్ కోహ్లీ చవిచూశాడు.. బ్యాట్స్‌మెన్‌గా. అందుకే, ఇంతటి కీలక నిర్ణయం తీసుకున్నాడని అనుకోవాలేమో. కాగా, టీ20 ప్రపంచకప్ పోటీలకు ముందు విరాట్ కోహ్లీ.. ఇదే కెప్టెన్‌గా ఆఖరి సిరీస్.. అని ప్రకటించడం అభిమానుల్ని తీవ్రంగా బాధిస్తోంది. తప్పదు.. క్రికెట్ అన్నాక.. మార్పులు చేర్పులు మామూలే. ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా జట్టుకు మరింత సమర్థవంతంగా ఉపయోగపడాలని భావిస్తోన్న విరాట్ కోహ్లీని ఎలా తప్పు పట్టగలం.?