Crime News: ప్రస్తుత కాలంలో చాలా మంది మోసం చేసేవారు వారి అతి తెలివి తేటలతో అమాయకుల్ని చాలా సులభంగా మోసం చేస్తుంటారు. ఈ రోజుల్లో మోసం చేసే వారి కన్నా మోసపోయే వాడిదే తప్పు . చివరికి పెన్షన్ పేరుతో అమాయకురాలైన ఒక వృద్ధురాలినీ మోసం చేసి ఆమె ఆస్తి కి అసలు పెట్టాలని చూశాడు ఒక వాలంటీర్. ఈ సంఘటన ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రాజకీయ నాయకుల అండతో వాలంటీర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.
వివరాల్లోకి వెళితే….తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ రూరల్ చీడిగలో రవి కుమార్ అనే వాలంటీర్ పెన్షన్ పేరుతో ఒక వృద్ధురాలిని మోసం చేయాలని చూశాడు.వాసంశెట్టి మంగాయమ్మ అనే వృద్ధురాలు తో పెన్షన్ కోసం అని చెప్పి అగ్రిమెంట్ స్టాంపు పేపర్ల మీద వేలిముద్రలు వేయించుకునీ ఆమె వద్ద ఉన్న 30 లక్షల రూపాయల విలువచేసే ఆస్తి కోసం స్కెచ్ వేశాడు. ఈ క్రమంలో 45 రోజుల తర్వాత బాధితురాలి చిన్న కోడలు సత్యవేణి పేరుతో లాయర్ నోటీసులు రావడంతో వాలంటీర్ నిర్వాకం బయటపడింది.
మంగాయమ్మ చిన్న కోడలు సత్యవేణి కి తన ఆస్తిని అమ్మటానికి ఒప్పందం కుదుర్చుకొని 25 లక్షల రూపాయలు డబ్బు చెల్లించినట్లు నోటీసుల లో ఉండటంతో ఆశ్చర్యపోవడం వృద్ధురాలి వంతయింది. అయితే మంగాయమ్మ చిన్న కోడలు ఎంపీటీసీ పదవిలో కొనసాగుతోంది.కొడుకు కోడలు మధ్య మనస్పర్థల కారణంగా కొంత కాలం నుండి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. వాలంటీర్ రవి కుమార్ ని వాడుకొని 30 లక్షల విలువ చేసే తన తల్లి ఆస్తిని కాజేయాలని చూస్తోందని సత్యవేణి భర్త ఆరోపించాడు. రాజకీయ నాయకుల అండతోనే తన భార్య ఇంతటి దారుణానికి కుట్ర చేసిందని ఆయన వెల్లడించారు.
ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవటంతో బాధితులు మంగాయమ్మ ఆమె కుమారుడు విశ్వనాథమ్ కలెక్టర్ ని ఆశ్రయించి తమకు న్యాయం జరగాలని వేడుకున్నారు.