ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడేళ్లుగా సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయి. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్నవాళ్లు తక్కువ సమయంలోనే పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే ఏపీలో అభివృద్ధి జరగడం లేదని ఒక విమర్శ ఉంది. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడం లేదని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఆ విమర్శలకు చెక్ పెట్టే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. కుప్పం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో ముచ్చటించిన జగన్ కుప్పంలోని 25 వార్డుల అభివృద్ధి కోసం ఏకంగా 66 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. 2024 ఎన్నికల్లో కుప్పం తరపున వైసీపీ అభ్యర్థి భరత్ పోటీ చేయనున్నారు. చంద్రబాబును కచ్చితంగా ఓడించాలనే ఆలోచనతో జగన్ ఈ స్థాయిలో నిధులను మంజూరు చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కుప్పంలో రోడ్లు వేయడంతో పాటు డ్రైనేజీ, తాగునీరు లాంటి కనీస అవసరాలను తీర్చనున్నారని సమాచారం. నిధులను సరిగ్గా వినియోగిస్తే కుప్పం నియోజకవర్గానికి కచ్చితంగా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిధులు దుర్వినియోగం కాకుండా కార్యాచరణను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది.
జగన్ మిగతా నియోజకవర్గాల సమస్యల పరిష్కారంలో కూడా ఇదే దిశగా అడుగులు వేస్తే మాత్రం ఏపీ ప్రజల్లో వైసీపీపై ఉన్న నెగిటివ్ అభిప్రాయాలు తొలగిపోయే ఛాన్స్ అయితే ఉంది. సీఎం జగన్ ఈ దిశగా అడుగులు వేయాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు.మరి జగన్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. జగన్ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తే ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.