గడప గడపకు మన ప్రభుత్వం వల్ల జగన్ సర్కార్ కు నష్టం జరిగిందా?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకముందు ప్రజల్లో ఉండటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. పాదయాత్రతో ప్రజలకు దగ్గరై ప్రజల సమస్యలను ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా జగన్ స్కీమ్ లను సిద్ధం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజల్లో చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి కనీస అవగాహన లేకపోయినా జగన్ ను నమ్మి ఓట్లేశారు.

గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల వల్ల ప్రజలకు ప్రస్తుతం పథకాలు తేలికగా అందుతున్నాయి. ఒకప్పుడు ప్రజలు ఎమ్మెల్యేలను కలిసి ఎమ్మెల్యేల సహాయసహకారాలతో ప్రభుత్వ పథకాలను పొందేవారు. జగన్ సర్కార్ పాలనలో ఈ పరిస్థితి మారింది. చాలామంది ఎమ్మెల్యేలు తాము అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకటే అనే భావనను కలిగి ఉన్నారు. అయితే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వల్ల జగన్ సర్కార్ కు నష్టం కలుగుతోంది.

చాలామంది ప్రజలు తమకు ఏదో ఒక పథకం ప్రయోజనం దక్కడం లేదని ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. అయితే ఆ పథకం వాళ్లకు ఎందుకు అందడం లేదో కారణం తెలియకపోవడం వల్ల ఎమ్మెల్యేలు ప్రజలకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం వల్ల వైసీపీకి జరిగిన మేలు కంటే కీడు ఎక్కువని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

జగన్ సర్కార్ తాజాగా 27 మంది ఎమ్మెల్యేలు పనితీరును మార్చుకోవాలని సూచించారు. అయితే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల ఇళ్ల వద్దకు వెళుతున్న ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న చేదు అనుభవాల గురించి పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.