విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయడం వల్ల ప్రయోజనం లేదని వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే, ఢిల్లీలో రాష్ట్రం తరఫున గట్టిగా వాదన వినిపించడానికి అవకాశం వుండదని విజయసాయిరెడ్డి చెప్పారు. పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలన్నా, ఆఖరికి ప్రధానితో భేటీ అయి రాష్ట్రం వాదనను వినిపించాలన్నా ఎంపీల అవసరం వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రపదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని విజయసాయిరెడ్డి ఘనంగా చెప్పుకున్నారుగానీ, ఈ తీర్మానాలతో ప్రయోజనం ఏంటన్నది ఆయనకే తెలియాలి.
ఉమ్మడి ఆంధ్రపదేశ్ విభజన సరికాదంటూ అప్పట్లో తీర్మానం జరిగింది. కానీ, విభజన ఆగలేదు. ప్రత్యేక హోదా కోసం పలుమార్లు 13 జిల్లాల ఆంధ్రపదేశ్ అసెంబ్లీలో తీర్మానాలు జరిగాయిగానీ, కేంద్రం దిగిరాలేదు. ఆయా విషయాల్లో అసెంబ్లీ తీర్మానాలు శుద్ద దండగ అని తేలిపోయాక కూడా అసెంబ్లీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని విజయసాయిరెడ్డి సగర్వంగా ప్రకటించడం హాస్యాస్పదమే అవుతుంది. ఇక, ప్రత్యేక హోదా కోసమంటూ గతంలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. అప్పట్లో టీడీపీ అధికారంలో వుంది ఆంధ్రపదేశ్‌లో. తద్వారా రాష్ట్రంలో రాజకీయ అలజడి రేగింది తప్ప, ఢిల్లీ పాలకులు దిగిరాలేదు. అయినాగానీ దాన్నొక ఘనకార్యంగా వైసీపీ చెప్పుకుంది. అన్నట్టు, అది వైసీపీకి రాజకీయంగా కలిసొచ్చింది.. వైసీపీ, 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయాన్ని అందుకోవడానికి ఆ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలు కూడా ఓ కారణం. ఇప్పుడు మాత్రం, రాజీనామాలు చేయడం వల్ల ప్రయోజనం లేదని విజయసాయిరెడ్డి చెబుతుండడం హాస్యాస్పదమే.