వైసీపీలో ఫైర్ బ్రాండ్లకు కొదవేమీ లేదు. ఎలాంటి సమస్యైనా ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం ఇవ్వగల సమర్థులు జగన్ వద్ద చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో కొందరికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి వారిలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే రోజా ప్రముఖులు. వీరిద్దరూ మాటల తూటాలు పేల్చడంలో సిద్దహస్తులు. విమర్శలతోనే చెమటలు పట్టించగ సమర్థులు. వైఎస్ జగన్ మీద ఏదైనా ఆరోపణ వస్తే ముందుగా స్పందించేది వీళ్ళే. ఇప్పటికే అనేక విషయాల్లో ప్రత్యర్థుల విమర్శలను తిప్పుకొట్టి తమ అధినేతను డిఫెండ్ చేసిన ఈ ఇద్దరూ తాజాగా మరొక అంశంలో జగన్ ముందు నిలబడి ప్రత్యర్థులను ఢీకొడుతున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వం మీద ఉద్దేశ్యపూర్వకంగా హిందూ మతం మీద దాడికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వచ్చాయి.
జగన్ క్రైస్తవ మతానికి చెందినవారు కాబట్టి పిఠాపురం, నెల్లూరు, అంతర్వేదిలో హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారని చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన విజయసాయిరెడ్డి ‘తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు’ అంటూ ట్విట్టర్ ద్వారా ఫైర్ అయ్యారు. అంతేనా సీఎం జగన్ ప్రారంభించిన వైఎస్సార్ ఆసర పథకం నుండి ప్రజల ద్రుష్టిని మరల్చడానికి చంద్రబాబు దళిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇలా విజయసాయి సోషల్ మీడియాలో ఫైట్ చేస్తుంటే ఎమ్మెల్యే రోజా నేరుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ముందుకొచ్చి చంద్రబాబును ఎడా పెడా కడిగిపారేశారు. అంతర్వేది రథం దగ్దం సంఘటనలో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని, గతంలో తునిలో రైలు తగలబెట్టించిన ఘనత, అమరావతి రైతుల భూములు తగలబెట్టించిన ఘనత చంద్రబాబుదేనని అంటూ గతంలో రాష్ట్రానికి సీబీఏఐ రావొద్దని జీవో ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సీబీఐ విచారణ కోరుతున్నారు. వైఎస్ జగన్ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారని అన్నారు. కేవలం వైఎస్ జగన్ గారికి ఒక మతాన్ని ఆపాదించి చెడ్డ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కుట్రని అన్నారు. ఇలా ఈ విజయసాయి, రోజా ఇద్దరూ జగన్ పరువు నిలపడం కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు.