టీడీపీ తరఫున ప్రచార బాద్యతలు భుజానికెత్తుకున్న విజయసాయిరెడ్డి.!

Vijaysai

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తమ రాజకీయ ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తరఫున ప్రచారం చేయడమేంటి.? అయినా, టీడీపీ ప్రచార బాధ్యతల్ని విజయసాయిరెడ్డి ఎందుకు భుజాన వేసుకుంటున్నట్లు.?

తెలుగుదేశం పార్టీ కథ కంచికి వెళ్ళిపోయినట్టే.! ఔను, 2019 ఎన్నికలతో ఈ విషయం నిరూపితమయిపోయింది. ఒక్క ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ గల్లంతయిపోయినట్లేనా.? అసలు, ఆ పార్టీ తరఫున గట్టిగా వకాల్తా పుచ్చుకున్న నాయకులెక్కడ.? అన్న ప్రశ్న వచ్చిందంటే.. ఆ పార్టీ ఖేల్ ఖతం అయిపోయినట్లు.

జనం కూడా టీడీపీని మర్చిపోతున్నారు. ఈ దశలో టీడీపీకి జాకీలేసేందుకు విజయసాయిరెడ్డి నానా తంటాలూ పడుతున్నారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియా హ్యాండిల్స్ తీసుకుంటే, అందులో వైసీపీకి సంబంధించిన అంశాల కంటే, చంద్రబాబుకి సంబంధించిన అంశాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి.

రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు ఎవరైనా చేస్తారు. కానీ, సొంత పార్టీ ప్రచారం పక్కన పెట్టి మరీ ప్రత్యర్థి పార్టీలకు అనవసరపు ప్రచారం కల్పించడమంటే, దాన్ని ఏమనుకోవాలి.? అక్కడికేదో చంద్రబాబు డబ్బలిచ్చి మరీ తనకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డితో ట్వీట్లేయించుకుంటున్నట్లుంది పరిస్థితి.

ఔను మరి, ఈ రోజుల్లో పాజిటివ్ పబ్లిసిటీ కంటే, నెగెటివ్ పబ్లిసిటీ వల్ల ఎక్కువ లాభం జరుగుతోంది. ఆ లెక్కన విజయసాయిరెడ్డి, తెలుగుదేశం పార్టీకి బోల్డంత మేలు చేస్తున్నట్లే కదా.? ఈ గూడుపుఠానీ సంగతేంటబ్బా.?