అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తూనే, ఎమ్మెల్యేకి శఠగోపం పెడుతున్న అనుచరులు

అన్నయ్యా అని ఆప్యాయంగా పిలుస్తున్నారు. అరె ఎన్నికల్లో సాయపడ్డారు కదా చేరదీస్తే… అన్నయ్యా పేరు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫుల్లుగా వాడేస్తున్నారు.విజయనగరంలో కొన్న దుస్థితి ఇదf. వైసీపీ కార్యకర్తలను నమ్మి చేరదీయడమే తప్పు అయిపోయింది విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి. కిందటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పూసపాటి అధితి గజపతిరాజు మీద గెలిచారు. దీంతో ఆయన పేరు మార్మోగిపోయింది. ఆయన గెలుపుకోసం స్థానికంగా ఉండే కార్యకర్తలు చాలా కష్టపడ్డారట. దీంతో వాళ్లందరినీ చేరదీశారు స్థానిక ఎమ్మెల్యే.

వీళ్లంతా ఎమ్మెల్యేని అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తూనే ఆయనకు చెడ్డపేరు తెస్తున్నారని టాక్‌ స్థానికంగా బలంగా వినిపిస్తోంది. ప్రతిపనికి ఎమ్మెల్యే పేరు తెగ వాడేసుకుంటున్నారట. అన్నయ్య పేరు చెప్పుకుంటూ… ఒక్కో ఆఫీసులో ఒక్కో తమ్ముడు తిష్టవేశాడు. కాంట్రాక్టుల నుంచి ల్యాండ్‌ సెటిల్మెంట్ వరకు దేన్ని వదలడం లేదంట. సచివాలయ వ్యవస్థను కూడా వీళ్లు వదలడం లేదట. గ్రామ సచివాలయాలను పార్టీ కార్యాలయాలుగా మార్చేశారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రతీ పనికి ఎంతో కొంత పుచ్చుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక టౌన్‌ ప్లానింగ్‌  కార్యాలయంలో అయితే ఏకంగా కౌంటర్‌ పెట్టేశారని సమాచారం. దీంతో విజయనగరంలో అక్రమనిర్మాణాలు పెరిగిపోతున్నాయట.

ఈ తమ్ముళ్ల అరాచకాలు అన్నీ ఎమ్మెల్యే కోలగట్లకు తెలుసట. కానీ.. వారికి కళ్లెం వేయలేని దుస్థితిలో ఉన్నారట ఆయన. కార్యకర్తలు ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే వచ్చే ఎన్నికలకు పనికొస్తారని ఆయన భావిస్తున్నారట. అయితే తమ్ముళ్లు అత్యాశతో అసలుకే ఎసరు తెస్తున్నారన్న విషయం ఆయన గుర్తించడం లేదని స్థానికులు చెబుతున్నారు.