ఆయనసలు రాజ్యసభ సభ్యుడేనా.? పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తూ.. ఇదేం పద్ధతి.? అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మీద విమర్శల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది.
విజయసాయిరెడ్డి ట్విట్టర్ అకౌంట్ ఎవరు రన్ చేస్తున్నారోగానీ, అత్యంత జుగుప్సాకరంగా తయారైంది వ్యవహారం. ఆయనే ఆ ట్వీట్లు వేస్తోంటే, అంతకన్నా దారుణం ఇంకేముంటుంది.? రాజకీయాల్లో విమర్శలు మామూలే కావొచ్చు. కానీ, మరీ ఇంత హేయంగానా.?
అయ్యన్న పాత్రుడు, వంగలపూడి అనిత.. వీళ్ళంతా మాజీ ప్రజా ప్రతినిథులు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యే అయినాగానీ, ఆయన ప్రతిపక్షంలో వున్నారాయె.! నిజానికి, రాజకీయాల్లో పదవులు లేనోళ్ళు కూడా మాట మీద అదుపుతో వుండాలి. దురదృష్టం, కీలక పదవుల్లో వున్నవాళ్ళూ మాట మీద అదుపు కోల్పోతున్నారు.
విజయసాయిరెడ్డి అయితే రెండు తిడుతున్నారు, ఇరవై రెండు తిట్లను ఎదుర్కొంటున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీద విజయసాయిరెడ్డి వేసిన ట్వీట్ల ఫలితం, ‘పిచ్చి ఆసుపత్రికి పంపించాల్సిన నిన్ను రాజ్యసభకి పంపించారు..’ అంటూ అట్నుంచి కౌంటర్ ఎటాక్ రావడం.
ఇలాంటి వ్యాఖ్యలు, సభ్య సమాజాన్ని ఆలోచనలో పడేస్తాయి. ‘నిజమే కదా.?’ అన్న భావన ప్రజల్లో కలిగితే, అది విజయసాయిరెడ్డికి నష్టం కలిగించకపోవచ్చు.. కానీ, వైసీపీకి తీరని నష్టం కలిగిస్తుంది. వైసీపీని ముంచెయ్యడానికే విజయసాయిరెడ్డి కంకణం కట్టుకున్నారన్న భావన, ఆయన ట్వీట్ల ద్వారా వైసీపీలోనే కలుగుతోందంటే, అది తప్పెలా అవుతుంది.?