టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో 2 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కామ్ లో అప్పటి ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్, ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణతో పాటు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఈ ప్రాజెక్టు పట్టాలకెక్కడంలో ముఖ్య పాత్ర పోషించింది వేమూరి హరికృష్ణే. అందుకే ప్రస్తుతం బంతి వేమూరి కోర్టులో ఉంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయకుండా.. నారా లోకేశ్ చేసినట్టుగానూ ఆరోపణలు వస్తున్నాయి.
అయితే.. తనపై వస్తున్న ఆరోపణలపై వేమూరి స్పందించారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు టెండర్ కమిటీలో తాను లేనని.. తాను కేవలం సాంకేతిక సలహాలు మాత్రమే ఇచ్చానంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై సీబీఐ విచారణకైనా తాను సిద్ధమని ఆయన తెలిపారు.
టెండర్ దక్కించుకున్న సంస్థకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదు. నిజాయితీగా పనిచేశా. రాజకీయ ప్రయోజనాలకోసం నాపై ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం 2 వేల కోట్లకు పైగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందంటూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఆరోపణలు చేశారు. కానీ.. అసలు ఆ ప్రాజెక్టు పేరు మీద ప్రభుత్వం ఖర్చు పెట్టిందే 700 కోట్లు అయితే… 2 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. రాజకీయ లబ్ధి కోసం ఒకరిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు.. అని వేమూరి స్పష్టం చేశారు.