వైఎస్ జగన్ సౌండ్ లేకుండా ఆపరేషన్ ఆకర్ష్ విధానాన్ని అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విధానంలో భాగంగానే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీకి జైకొట్టారు. ఈయన పార్టీని వీడటంతో విశాఖలో టీడీపీ ఇంకొంత బలహీనపడింది. ఈయన పార్టీ పిరాయించడంతో నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఒకరిద్దరు పార్టీ నుండి వెళ్లిపోతే నష్టమేమీ లేదని అసహనం వ్యక్తం చేశారు. వైసీపీకి జైకొట్టిన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన అందరు పిరాయింపు ఎమ్మెల్యేల తరహాలోనే చంద్రబాబు మీద తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు.
వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో సముద్రమంత మార్పు కనిపిస్తోందని, ఇంకో 20, 30 ఏళ్లు జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని బల్లగుద్ది చెప్పారు. 14 నెలల్లో 59 వేల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేసిన పార్టీ దేశంలో వైసీపీ మాత్రమేనని పొగిడేశారు. సౌత్ నియోజకవర్గం కోసం టీడీపీ హయాంలో బంట్రోతులా పనిచేశాను, కానీ ఏ పనీ జరగలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ఏ పని కావాలన్నా చేయించుకోమని అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసం ఉద్యమం చేయమనలేదు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయమన్నారు. మనసు చంపుకునే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. 14 నెలలు టీడీపీలో మనసు చంపుకుని పనిచేశాను అంటూ చంద్రబాబు, టీడీపీల మీద తీవ్ర విమర్శలు గుప్పించారు.
మనసు చంపుకొని టీడీపీలో ఉండలేకపోయాను. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. నాపై అనర్హత ఫిర్యాదు చేసుకోమనండి అంటూ సవాల్ విసిరారు. అయితే ఆయన అన్నట్టు బాబుగారు అనర్హత వేటు వేసే అవకాశం లేదు. ఇప్పటికే బయటికి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలు వాసుపల్లి కంటే 10 రెట్లు మించి బాబుగారి మీద ఆరోపణలు చేస్తున్నారు. అనర్హత వేటు వేయమని అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కూడ చెల్లని ఓటు వేశారు. అయినా వారి మీద ఎలాంటి చర్యలకు చంద్రబాబు ఉపక్రమించలేదు. ఒకవేళ అలా చేస్తే శాసన సభలో టీడీపీ బలం పడిపోతుంది. అందుకే వారిని సస్పెండ్ చేయట్లేదు. కనుక వాసుపల్లి సైతం ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబు సైడ్ నుంచి రెస్పాన్స్ పెద్దగా ఉండకపోవచ్చు.