తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసం ఎంతో పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు..ముఖ్యంగా స్త్రీలు శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున పూజలు నోములు వ్రతాలు అంటూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ప్రతి ఏడాది శ్రావణమాసంలో అమ్మవారిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు అందుకే పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రతి ఏడాది వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఐదవ తేదీ వచ్చింది.
ఇకపోతే వరలక్ష్మి వ్రతం చేయడం కోసం మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ వ్రతం ఆచరిస్తారు.అందంగా అమ్మవారిని ముస్తాబు చేసుకుని పెద్ద ఎత్తున పిండి వంటలు ప్రసాదాలు తయారుచేసి అమ్మవారికి సమర్పించడమే కాకుండా ఆరోజు అమ్మవారి కథ వింటూ ఈ వ్రతం ఆచరిస్తారు.ఈ విధంగా ఉపవాసంతో అమ్మవారి వ్రతం చేయటం వల్ల సకల సంపదలు కలిగిస్తుందని భావిస్తారు.అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చు అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.
సాధారణంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకూడదని చెబుతుంటారు అయితే అవన్నీ కేవలం అపోహ మాత్రమేనని గర్భిణీ స్త్రీలు సైతం వరలక్ష్మి వ్రతాన్ని యధావిధిగా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే సాధారణ మహిళలు మాదిరిగా గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండకుండా ఈ పూజ ఆచరించాలి. గర్భిణీ స్త్రీలు ఉపవాసంతో వ్రతం చేయటం వల్ల బిడ్డకు ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే గర్భిణీ స్త్రీలు ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఆహారం తీసుకోవడం మంచిది. అయితే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 22 రోజుల వ్యవధిలో ఉన్నవారు ఈ వ్రతం ఆచరించకూడదు.