వరలక్ష్మి వ్రతం నాడు.. ఈ పని చేస్తే మీ ఇంట సిరులు కురుస్తాయి..!

శ్రావణమాసంలో ఆధ్యాత్మిక శోభతో కళకళలాడే వరలక్ష్మీ వ్రతం వచ్చేసింది. 2025 ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా హిందూ మహిళలు సిద్ధమవుతున్నారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవడం హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

ఈ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవిని పరిపూర్ణంగా పూజించాలనే ఉద్దేశ్యంతోనే ఈ పండుగ జరుపుకుంటారు. అష్టైశ్వర్యాలను ప్రసాదించే అమ్మవారికి పసుపు, కుంకుమలతో అలంకరించి, మంగళహారతులతో సేవించటం సంప్రదాయం. శ్రావణ శుక్రవారం నాడు ఉదయం వేకువజామునే లేచి శౌచస్నానం చేసి ఇంటిని శుభ్రపరచడం, వాకిళ్లలో చక్కటి ముగ్గులు వేయడం, పూజా స్థలాన్ని ఏర్పాటుచేసి లక్ష్మీదేవిని పీఠంపై కూర్చోబెట్టి పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం.

ఈ రోజు లక్ష్మీదేవికి నవధాన్యాలు సమర్పించడం, అరటిపండు, కొబ్బరికాయలతో నివేదన చేయడం ఎంతో ప్రీతికరం. ఈ విధంగా సమర్పించినవారికి ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందన్న విశ్వాసం. పూజలో లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళిని పఠించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే, వ్రతానంతరం ముత్తయిదువులకు పసుపు, కుంకుమలతో వాయనం ఇచ్చే ఆనవాయితీ ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది. వారు ఇంటికి వచ్చినప్పుడు గౌరవపూర్వకంగా సాగనంపడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మరింతగా లభిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే ఈ రోజు దానం చేయడం కూడా విశేష ఫలితాలనిస్తుందని చెబుతున్నారు.

వ్రతాన్ని ఉదయాన్నే చేయడం శ్రేష్ఠమైనదే అయినా.. ఉదయం వీలుకాని వారు సాయంత్రం పూజచేసినా ఫలితం లభిస్తుందని చెబుతున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా లక్ష్మీదేవిని ఏనుగులతో పాటు పూజిస్తారు. ఏనుగు బలాన్ని సూచిస్తుంది… ఇది శాంతి, శుభం, సంపదలకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇక ఈ వరలక్ష్మీ వ్రతానికి మరుసటి రోజు శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ జరుపుకుంటారు. అన్నా-చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇలా శ్రావణమాసంలో వరుస పర్వదినాలు హిందూ కుటుంబాల్లో భక్తి శ్రద్ధలతో నిండిన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకుంటూ కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం కోరుకుంటారు. ఈ వ్రతం మీ ఇంటిని శుభంతో నింపాలని ఆకాంక్షిద్దాం.