గన్నవరం నియోజక వర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చిన్నందుకు సంతోషపడాలో, బాధపడలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అర్ధం కావడం లేదు. గన్నవరం నియోజక వర్గం టీడీపీకి కంచుకోట అక్కడ నుండి వంశీ వైసీపీ రావడంతో జగన్ సంతోషించారు. అయితే ఇప్పుడు వంశీ పార్టీలోకి ఎందుకు వచ్చారని జగన్ ఫీల్ అవుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.
వంశీ రాకతో వైసీపీలో గొడవలు
వంశీ వైసీపీలోకి రావడాన్ని మొదటి నుండి అక్కడ ఉన్న వైసీపీ నేతలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, స్థానిక వైఎస్సార్ సీపీ నేతల మధ్య నెలకొన్న వర్గపోరు బట్టబయలైంది. నియోజకవర్గంలోని బాపులపాడు మండలం కాకులపాడులో ఆదివారం రైతుభరోసా కేంద్రానికి శంకుస్థాపన జరిగిన సందర్భంగా ఇరువర్గాల మధ్య నెలకొన్న లుకలుకలు తారస్థాయికి చేరాయి. టీడీపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీ.. ప్రస్తుతం వైఎస్సార్ సీపీకి మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వంశీకి.. స్థానిక వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది.
జగన్ పరిష్కారం చూపినా ఆగని పోరు
ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి, యార్లగడ్డ వెంకట్రావు శాంతింపజేసేందుకు అధిష్టానం ఆయనకు నామినేటెడ్ పదవి కూడా కట్టబెట్టింది. అయినప్పటికీ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్లేదు. తాజాగా యార్లగడ్డ వంశీనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన అద్దె నాయకుడని, తానే అసలైన వైసీపీ నేత అని పేర్కొన్నారు. వంశీ పార్టీలో అడుగుపెట్టాక నియోజకవర్గంలోకి రాకూడదని భావించినా.. తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం వచ్చానని చెప్పారు. జగన్ చెప్పినా ఈ నాయకులు వినకపోవడంతో వైసీపీ సీనియర్ నేతలు కూడా పట్టించుకోవడం లేదు. ఈ నాయకుల మధ్య పోరు ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి.