సినిమా గోల: వైసీపీలో చిచ్చు రేపుతున్న ‘వకీల్ సాబ్’

Vakeel Saab Tremors In YCP

Vakeel Saab Tremors In YCP

ఓ సినిమా గురించి ఓ రాజకీయ పార్టీ, అందునా.. అధికారంలో వున్న పార్టీ ఇంతలా గొంతు చించుకోవడం గతంలో ఎప్పుడూ ఎవరూ చూడలేదా.? అంటే, సినిమాల చుట్టూ రాజకీయాలు సర్వసాధారణమే అయినా, ఈసారి చాలా చాలా ప్రత్యేకం. రాజకీయ వివాదాలతో కొన్ని సినిమాలు విడుదలకు నోచుకోని సందర్భాలున్నాయి. అయితే, ‘వకీల్ సాబ్’ పొలిటికల్ గొడవ ఇంకాస్త భిన్నమైనది. మంత్రులు మీడియా ముందుకొచ్చి ‘వకీల్ సాబ్’ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నదారు. ఇది వైసీపీ కార్యకర్తలకు అస్సలు మింగుడుపడ్డంలేదు. నెగెటివ్ యాంగిలే అయినా.. ‘వకీల్ సాబ్’ సినిమా గురించి మాట్లాడటం వల్ల తమ పార్టీ స్థాయి తగ్గిపోతుందనీ, ముఖ్యమంత్రికి చెడ్డపేరు వస్తోందనీ వైసీపీ కార్యకర్తలైన నెటిజన్లు వాపోతున్నారు. బ్లాక్ టిక్కెట్ల గురించి నిన్న ఓ మంత్రి ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, ఊకదంపుడు ప్రసంగమిచ్చేశారు. నిజానికి, బ్లాక్ టిక్కెట్ల ద్వారా వచ్చే సొమ్ములు అటు నిర్మాతకిగానీ, ఇటు హీరోకిగానీ చెందవు. స్థానికంగా థియేటర్ల యాజమాన్యాలు పండగ చేసుకుంటాయి.. ఒక్కోసారి స్థానిక రాజకీయ నాయకులకు వాటాలు వెళుతుంటాయి. ఇటీవలి కాలంలో పెద్ద హీరోల సినిమాల్ని రాజకీయ నాయకులే, తమ అనుచరుల ద్వారా ప్రదర్శిస్తున్నారు థియేటర్లలో.

ఈ క్రమంలో ప్రదర్శన హక్కుల కోసం పెద్దయెత్తున చెల్లిస్తూ, అవి రాబట్టుకునేందుకు స్థానికంగా రేట్లు పెంచేస్తున్నారు. కృష్ణా జిల్లాకి చెందిన ఓ కీలక నేత తనయుడు ‘వకీల్ సాబ్’ సినిమా ప్రదర్శన హక్కులు పొంది, ప్రభుత్వ చర్యతో తీవ్రంగా నష్టపోయాడట. ఆ అక్కసుతోనే సదు ముఖ్య నేత, తమ ప్రభుత్వాన్ని విమర్శించలేక, ‘వకీల్ సాబ్’ సినిమాపై ఏడుపు మొదలెట్టారని అంటున్నారు. గతంలో ఎన్నడూ చూడని చిత్ర విచిత్రమైన పరిస్థితి ఇది. కేవలం పవన్ కళ్యాణ్ సినిమా కోసమేనా ఇదంతా.? త్వరలో విడుదలయ్యే పెద్ద సినిమాలన్నిటికీ ఇదే పద్ధతిని ఏపీ ప్రభుత్వం పాటిస్తుందా.? అలాగైతే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా పరిస్థితి ఏమవుతుంది.? వేచి చూడాల్సిందే.