Vaccine: దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ నేటి నుంచి ప్రారంభవుతోంది. ఈ దశలో 18 నుంచి 44 ఏళ్ళ లోపువారికి వ్యాక్సినేషన్ కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటిదాకా 45 ఏళ్ళ పైబడిన వయసువారికి వ్యాక్సినేషన్ అందిస్తున్న విషయం విదితమే. కాగా, మూడో దశలో వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకంగా ధరలు నిర్ణయించాయి వ్యాక్సిన్ తయారీ సంస్థలు. మరోపక్క, వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్లు బీభత్సంగా జరిగాయి. కానీ, వ్యాక్సిన్లే అందుబాటులో లేవు.
దాంతో, కేవలం 6 నుంచి 8 రాష్ట్రాల్లో మాత్రమే మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కూడా ఎంపిక చేసిన అతి కొద్ది చోట్ల మాత్రమే వ్యాక్సిన్ పరిమిత సంఖ్యలోనే అందుబాటులో వుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మూడో దశ వ్యాక్సినేషన్ ఇప్పట్లో ప్రారంభమయ్యేలా కనిపించడంలేదు. వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకోలేదు. పైగా, ఇప్పటిదాకా వ్యాక్సినేషన్ అందిస్తోన్న 45 ఏళ్ళ వయసు పైబడినవారికే అందాల్సిన రీతిలో వ్యాక్సిన్లు అందని పరిస్థితి.
అను నిత్యం కోట్లాది డోసులు ఉత్పత్తి అయితే తప్ప, దేశంలో వేగంగా మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టే అవకాశం లేదు. కానీ, స్థాయిలో వ్యాక్సిన్లను తయారు చేసే సామర్థ్యం ప్రస్తుతం వ్యాక్సిన్లు అందిస్తున్న సంస్థలకు లేదు. పరిస్థితి ఇంత స్పష్టంగా అందరికీ అర్థమవుతున్నా, కేంద్రానికి మాత్రం.. అదేమీ పట్టనట్టు.. మూడో దశ వ్యాక్సినేషన్ పక్రియను ప్రకటించేసి చేతులు దులుపుకుంది. నిజానికి జాతీయ వ్యాక్సినేషన్ విధానం సరిగ్గా లేకపోవడమే ఈ సమస్యకి కారణం. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందిస్తోన్న భారతదేశం.. అని గతంలో గొప్పగా చెప్పుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ‘వ్యాక్సినో రామచంద్రా..’ అని దేశ ప్రజానీకం గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకపోవడం శోచనీయం.