మాటలు కోటలు దాటేస్తాయ్.. చేతలు మాత్రం గడప కూడా దాటవ్.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పని తీరు గురించి ఇంతకన్నా గొప్పగా ఏం చెప్పగలం.? పెద్ద నోట్ల రద్దు నుంచి, కరోనా వ్యాక్సిన్ వరకు.. ఏ విషయాన్ని తీసుకున్నా అంతే. 130 కోట్ల మంది జనాభా వున్న దేశంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆదేశించేశారు. అస్సలేమాత్రం వ్యాక్సిన్ కొరత అనేదే లేదని ప్రకటించేశారు మోడీ. కానీ, వివిధ రాష్ట్రాలు, ‘వ్యాక్సిన్ లేదు మహాప్రభో..’ అంటూ కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలో ముందుగా వ్యాక్సిన్ కొరత అంశం తెరపైకొచ్చింది.
ఆ తర్వాత మిగతా రాష్ట్రాలూ గొంతు కలిపాయి. వ్యాక్సిన్ ఉత్సవం అంటే మాటలు కావు. ఆ మాట చెప్పేముందు, దేశంలో కరోనా వ్యాక్సిన్ ఎంతవరకు అందుబాటులో వుంది.? అన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి దేశంలో సాధ్యమేనా.? అన్నది కీలకం ఇక్కడ. వ్యాక్సిన్ తయారీ మాత్రమే కాదు, రవాణా.. ఆ తర్వాత వ్యాక్సినేషన్.. ఇలాంటి కీలకమైన అంశాలు ఇంకా చాలానే వున్నాయి. అన్నటికీ మించి ప్రజల్లో అవగాహన పెంచాలి. ‘మాకొద్దు బాబోయ్ వ్యాక్సిన్’ అని చాలామంది జనం అనుకుంటున్నప్పుడే వ్యాక్సిన్ కొరత ఏర్పడితే, ‘వ్యాక్సిన్ కావాలి మహాప్రభో..’ అని జనం ఎగబడితే పరిస్థితేంటి.? రానున్న రోజులు అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా కరోనా కేసులు హద్దూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ కోసం డిమాండ్ కూడా పెరుగుతోంది. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం కూడా కేంద్రానికి వ్యాక్సిన్ డోసుల విషయంలో అభ్యర్థన పంపింది. తెలంగాణ సంగతి సరే సరి. అన్ని రాష్ట్రాలూ రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లను తమ ప్రజలకు అందించాలనుకుంటున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వ డొల్లతనం బయటపడిపోతోంది.