అందరికీ వ్యాక్సినేషన్.. రైటా.? రాంగా.? ఇదేం దిక్కుమాలిన చర్చ.?

Vaccination For All
Vaccination For All
వ్యాక్సినేషన్ తప్ప కరోనా వైరస్ నుంచి మనల్ని ఇంకేదీ కాపాడలేదంటూ ఓ పక్క కేంద్రం స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. అందుకే, అన్ని దేశాల్లోనూ వ్యాక్సినేషన్ ఓ ఉద్యమంలా జరుగుతోంది.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. కోట్లాదిమంది ఇప్పటికే వ్యాక్సిన్లను అందుకున్నారు. వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సినేషన్ చేయగలిగితే కరోనా వైరస్ అదుపులోకి వస్తుందన్నది నిపుణుల వాదన.
 
ఆ దిశగానే వ్యాక్సినేషన్ జరుగుతోంది కూడా. అందరికీ వ్యాక్సినేషన్.. అంటూ వ్యాక్సిన్ లభ్యత మేరకు గ్రూపుల వారీగా ప్రజల్ని విభజించి, ఎవరైతే కరోనా వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశముందో వారికి ముందుగా వ్యాక్సిన్లను ఇస్తున్నారు.
 
కానీ, అందరికీ వ్యాక్సినేషన్ మంచిది కాదంటూ ఓ వాదన తెరపైకొచ్చింది. విచ్చలవిడిగా వ్యాక్సినేషన్ చేయించుకుంటూ పోతే వైరస్ మ్యుటేషన్లు ఎక్కువైపోతాయన్నది కొందరు నిపుణుల వాదన. ఈ వైరస్ మ్యుటేషన్ల వల్ల వ్యాక్సినేషన్ ప్రయోజనాలు వుండవనీ, వ్యాక్సిన్ మీద విజయం సాధించే మ్యుటేషన్లు పుట్టుకొచ్చే ప్రమాదం వుందనీ సదరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరి వాదనలో నిజమెంత.? అన్నదానిపై మళ్ళీ భిన్నవాదనలున్నాయి. అది అసలు అసాధ్యం.. అంటూ గతంలో తయారైన వ్యాక్సిన్లు, అదుపులోకి వచ్చిన ‘వైరస్’ల గురించి చెబుతున్నారు నిపుణులు.
 
అదే సమయంలో, వ్యాక్సిన్ వేసినవారికీ కరోనా వైరస్ సోకుతున్న వైనాన్ని చూపుతూ, కొత్త మ్యుటేషన్లు ఇబ్బందిపెడుతున్న వైనాన్ని ప్రస్తావిస్తున్నారు మరికొందరు. చిత్రమేంటంటే, మన భారతదేశంలోనే ఈ తరహా ‘ఒకదానికొకటి పూర్తి భిన్నమైన వాదనలు’ కరోనా వ్యాక్సినేషన్ విషయంలో జరుగుతుండడం. కరోనా వైరస్ మీద ఇంకా ఇంకా చాలా అధ్యయనాలు జరగాలి. కానీ, ఈలోగా ఎవరికి తోచిన ప్రకటనలు వాళ్ళు చేసేస్తుండడం వ్యాక్సినేషన్ మీద తీవ్రప్రభావాన్నే చూపుతున్నాయి.