కరోనా వైరస్ రెండో వేవ్ నేపథ్యంలో షురూ అయిన లాక్ డౌన్ సత్ఫలితాలనే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించలేదుగానీ, చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ అంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత తగ్గింది. అక్కడ లాక్ డౌన్ మంచి ఫలితాన్నే ఇచ్చింది. అనూహ్యంగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు దిగి వచ్చాయి. దాంతో, జూన్ 1 నుంచి అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది దేశ రాజధానిలో. మరోపక్క, దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా అన్ లాక్ వైపుగా అడుగులు వేస్తున్నాయి. అసలు సిసలు సమస్య ఇప్పుడే మొదలు కాబోతోంది. గతంలో కూడా అంతే. మొదటి వేవ్ తర్వాత క్రమంగా అన్ లాక్ నిబంధనలతో ప్రజల్లో విచ్చలవిడితనం పెరిగింది. మరీ ముఖ్యంగా, రాజకీయ పార్టీలు నిర్లజ్జగా వ్యవహరించాయి. అధికారంలో వున్నవారు సైతం, కరోనా వైరస్ అంతకు ముందు మిగిల్చిన నష్టాన్ని లైట్ తీసుకోవడంతో, అనూహ్యంగా కరోనా సెకెండ్ వేవ్ వచ్చిపడింది. కనీ వినీ ఎరుగని విధ్వంసానికి కారణమైంది ఈ వేవ్.
ఎంతోమంది తమవారిని కోల్పోయారు.. సామాన్యుల జీవితాలు నడి రోడ్డు మీద పడిపోయాయి. ఆకలి బాధలతో ఎంతోమంది అసువులు బాసారు. అయితే, కోవిడ్ మరణాలు తప్ప, ఇలాంటి మరణాలేవీ లెక్కల్లోకి రాలేదు. ఇంతటి భయంకరమైన విపత్తుని చవిచూసిన భారతావని, కొత్త పాఠం ఏమైనా నేర్చుకుందా.? అంటే, లేదనే చెప్పాలి. అప్పుడే రాజకీయ కార్యక్రమాలు షురూ అవుతున్నాయి. అధికారంలో వున్నోళ్ళు రాజకీయ కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యతనిస్తున్నారు. మరోపక్క, కేంద్రమూ చేతులు దులుపుకుంటోంది. రెమిడిసివిర్ బాధ్యత ఇకపై రాష్ట్రాలదే అంటోంది. వ్యాక్సిన్ల వ్యవహారంపై ఇప్పటికే చేతులెత్తేసింది. అంటే, మూడో వేవ్ అనేది వస్తే.. కేంద్రం పట్టించుకోదు.. రాష్ట్రాలు భరించలేవు. మరి, సామాన్యుడి పరిస్థితేంటి.?