రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు దిగువకు చేరుకుంటోంది. అత్యంత వేగంగా గ్రాఫ్ కిందికి పడిపోతోంది. ఆహ్వానించదగ్గ పరిణామమే ఇది. పలు రాష్ట్రాలు ఇప్పటికే అన్ లాక్ దిశగా నిర్ణయాలు తీసేసుకున్నాయి. దాంతో, జన జీవనం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. కానీ, అసలు సిసలు ముప్పు ఇప్పుడే మొదలు కాబోతోంది.
మళ్ళీ జనం గుమికూడే పరిస్థితులు తప్పవు. దాంతో, కరోనా మరోమారు విరుచుకపడటానికి ఆస్కారం ఏర్పడుతుంది. వ్యాక్సినేషన్ వేగంగా జరిగితే తప్ప, కరోనా వైరస్ నుంచి పూర్తి రక్షణ పొందలేం. కానీ, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా నడుస్తోంది.. తాబేలు నడకతో పోటీ పడుతోంది. అయితే, అన్ లాక్ చేయకపోతే.. రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతాయి.. దేశ ప్రజల పరిస్థితీ దారుణంగా తయారయిపోతుంది.
ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవ్వాలి.. ఛాయ్ బండి నుంచి.. పరిశ్రమల దాకా.. అన్నీ నడవాల్సిందే. కానీ, ముందు నుయ్యి.. వెనక గొయ్యి.. అన్నట్టుంది సామాన్యుడి పరిస్థితి. ప్రభుత్వాలు రాత్రికి రాత్రి కర్ఫ్యూ అనో, లాక్ డౌన్ అనో ప్రకటించేస్తే.. ఆ షాక్ దెబ్బకే గుండెలు బద్దలైపోతున్నాయ్.. ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మొదటి వేవ్ దెబ్బ నుంచి కోలుకోవడానికి దేశ ప్రజలకు చాలా సమయం పట్టింది. పూర్తిగా కోలుకోకముందే, రెండో వేవ్ వచ్చింది.
ఈసారి పూర్తిగా చచ్చిపోయింది కొన్ని వర్గాల ప్రజల జీవనం. మరిప్పుడు ఏం జరగబోతోంది.? తిరిగి జనం పట్టణాల వైపుకు వస్తారా.? లేదంటే, గ్రామాలకే పరిమితమవుతారా.? కొన్ని అధ్యయనాల ప్రకారం గ్రామీణ భారతం కాస్త స్థిరంగా కనిపిస్తోందనీ.. నగరాలే వెలవెలబోతున్నాయనీ తెలుస్తోంది. ఏమో, ముందు ముందు ఏం జరుగుతుందోగానీ, థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో.. ప్రజలకు ప్రభుత్వాలే భరోసా కల్పించాలి.