స్మృతి ఇరానీ.. మంచి వాగ్దాటి. బీజేపీలో పవర్ ఫుల్ లీడర్. అందుకే ఆమె బీజేపీ హయాంలో కేంద్రమంత్రగా కొనసాగుతూ వస్తున్నారు. బీజేపీ మొదటి హయాంలోనూ ఆమె కేంద్ర మంత్రిగా కొనసాగారు. అయితే.. ఎక్కడో ఢిల్లీలో ఉండే స్మృతి ఇరానీ ప్రస్తుతం హైదరాబాద్ లో లాండ్ అయ్యారు. దానికి కారణం కూడా మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా.. అందుకే బీజేపీ ఏకంగా కేంద్రమంత్రులనే హైదరాబాద్ లో దించుతోంది. వాళ్లలో ప్రచారం చేయిస్తోంది.
ఇప్పటికే బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య తెగ హడావుడి చేస్తున్నాడు హైదరాబాద్ లో. మరో కేంద్ర మంత్రి జవదేకర్ కూడా హైదరాబాద్ లో ప్రచారం నిర్వహించి వెళ్లారు. ఇప్పుడు స్మృతి ఇరానీ వంతు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హైదరాబాద్ వస్తున్నారట.
ఇక.. స్మృతి రావడం రావడమే టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్మృతి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీల మధ్య పొత్తు ఉందని.. అటువంటి పార్టీలను జీహెచ్ఎంసీ ప్రజలు గెలిపిస్తారా? అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అసలు ప్రజల మద్దతే లేదన్నారు. హైదరాబాద్ వరదల్లో 80 మంది మృతి చెందితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటూ దుయ్యబట్టారు.