మరో కేంద్రమంత్రి కరోనా బారినపడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే కరోనా పరీక్షలు చేయించుకోగా, ఆయనకు పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.
కాగా, తనకు కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నానని చౌబే ట్విట్టర్ లో వెల్లడించారు. తనను ఇటీవల కలిసిన వాళ్లందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని, ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, డాక్టర్ల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉన్నానని, అన్ని కరోనా మార్గదర్శకాలు పాటిస్తున్నానని తెలిపారు.
బ‌్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన ఆరుగురిలో కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఇందులో బెంగళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్‌లో మూడు శాంపిళ్లు, హైదరాబాద్ సీసీఎంబీలో 2 శాంపిళ్లు, పుణె ఎన్ఐవీలో ఒక శాంపిల్‌లో కొత్త రకం వైరస్‌ను గుర్తించినట్లు తెలిపింది. ఈ ఆరుగురిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. వీళ్లతో కాంటాక్ట్ ఉన్న వాళ్లందరినీ క్వారంటైన్‌కు తరలించినట్లు చెప్పింది. వీళ్లతోపాటు ప్రయాణించిన ఇతర ప్రయాణికులు, వారి కుటుంబాలు, ఇతరులను వెతికే పనిలో అధికారులు ఉన్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా కేంద్రం వెల్లడించింది.