అంబానీ ఇంటి వద్ద బైక్ కలకలం…వెలుగులో షాకింగ్ విషయాలు !

పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో మరోసారి గుర్తుతెలియని వాహనం నిలిపి ఉంచడంతో కలకలం సృష్టించింది. గురువారం మధ్యాహ్నం అంబానీ అంటిలియా నివాసం వద్ద ఎంహెచ్‌ 01డీడీ 2225 నెంబరుగల బైక్‌ను ఎవరో ఉంచి వెళ్లారు. ఫిబ్రవరి 25న పేలుడు పదార్థాలతో కూడిన వాహానాన్ని నిలిపిన ప్రదేశంలోనే ఓ బైక్‌ను నిలిపి ఉంచారు. పేలుడు పదార్ధాలతో కూడిన వాహనం కేసులో ఒక వైపు దర్యాప్తు కొనసాగుతుండగానే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వివరాలపై ఆరా తీశారు. అయితే, రవాణా శాఖ అధికారుల వద్ద ఈ బైక్‌ వివరాలు, పత్రాలు, ఛాసిస్‌ నెంబరు తదితర సమాచారం ఏదీ లభించలేదు. దీనిపై గవ్‌దేవీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్ని రోజుల నుంచి ఈ బైక్‌ను అక్కడ నిలిపి ఉంచారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాహన యజమానిని గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నారు.

మరోవైపు, అంబానీ బెదిరింపుల కేసులో అరెస్టయిన పోలీస్ అధికారి సచిన్ వాజేను ఎన్ఐఏ కస్టడీకి ఏటీఎస్ అప్పగించింది. అతడిని ఎన్ఐఏ కోర్టులో గురువారం ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందే వాజే కార్యాలయం నుంచి నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. అంతేకాదు, మన్‌సుఖ్ హిరేన్ హత్యకు ముందు సచిన్ వాజే గడిపిన దక్షిణ ముంబయిలోని ఫైవ్-స్టార్ హోటల్‌లో ఎన్ఐఏ కీలక వివరాలను సేకరించింది. నకిలీ ఆధార్ కార్డుతో అతడు అక్కడ గది తీసుకున్నట్టు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా ఆ హోటల్‌లోకి రెండు బ్యాగులతో వాజే వచ్చినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిది. ఇదే కేసులో అరెస్టయిన కానిస్టేబుల్ వినాయక్ షిండే, బుకీ నరేశ్ గోరేలను విచారిస్తున్నారు.