ఢిల్లీ వేదికగా జరుగుతున్న ‘రైజింగ్ నార్త్ఈస్ట్ ఇన్వెస్టర్స్ సదస్సు’లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశ భద్రతకు ఎంత ముఖ్యమో ఈ సందర్భంలో మరోసారి ఋజువైంది అని ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఇటీవల విజయవంతమైన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ప్రస్తావిస్తూ, ఇది మోదీ నాయకత్వ పటిమకు భద్రతా బలగాల ధైర్యసాహసానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రధాని మోదీ స్వయంగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈశాన్య భారతదేశాన్ని “అష్టలక్ష్మి”గా అభివర్ణించారు. దేశాభివృద్ధిలో ఈ ప్రాంతం కీలకంగా మారుతుందని చెప్పారు. అభివృద్ధికి ప్రతిరూపంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన అంబానీ, ‘‘భద్రతా దళాల ధైర్యాన్ని చూసి గర్వపడుతున్నా. వారు దేశ రక్షణ కోసం చేస్తున్న కృషి అమోఘం. ఉగ్రవాదంపై పోరులో మోదీ లీడర్‌షిప్ అసాధారణంగా ఉంది’’ అని అన్నారు. ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర స్థావరాలపై జరిగిన చర్యలు దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు.
‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన అంబానీ, ‘‘దేశాన్ని బలంగా నిలబెట్టే మోడీ నాయకత్వానికి, శక్తివంతమైన సైనిక వ్యవస్థకు సెల్యూట్’’ అన్నారు. భద్రత విషయంలో దేశం ఒకటిగా ఉండాలని, ప్రతి పౌరుడు వీర జవాన్ల పట్ల గౌరవాన్ని చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా మోదీ నాయకత్వంపై మళ్లీ ఓసారి ఇండస్ట్రీ పెద్దల మద్దతు చాటిచెప్పినట్లైంది.