ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. కరోనా వ్యాధి బారిన పడిన రోగుల చికిత్స కోసం తాత్కాలికి సహాయకేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ క్రమంలో ఫంక్షన్ హాళ్ళను స్వాధీనం చేసుకుని, కరోనా పేషెంట్ల కోసం సహాయకేంద్రాలను నడిపే బాధ్యతను ఎన్జీవోలకు, ట్రస్టులకు అప్పగించాలని ఉండవల్లి కోరారు.
ఇక ఇప్పటికే కరోనా రోగులకు సాయం చేసేందుకు, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, ట్రస్టులు సిద్ధంగా ఉన్నాయని, ఈ సహాయకకేంద్రాల నిర్వహణకు అయ్యే ఖర్చులు, స్వచ్ఛందసంస్థలే భరిస్తాయన్నారు. అయితే ప్రభుత్వం తరుపున డాక్టర్లు, నర్సులను అందిస్తే చాలన్నారు ఉండవల్లి.
రాజమండ్రిలో జైన్ సంఘం ఆధ్వర్యంలో ఒక కల్యాణ మండపంను అద్దెకు తీసుకుని, దాదాపు 60 పడకలతో కరోనా క్వారంటైన్ సెంటర్‌ను నడుపుతున్నారని ఉండవల్లి అరుణ కుమార్ తెలిపారు. ఇక ప్రయివేటు ఆసుపత్రుల్లో కూడా కోవిడ్ పరీక్షలకు అనుమతించడంతో పాటు, ఫీజును కూడా ప్రభుత్వమే నిర్ణయించాలని ఉండవల్లి అన్నారు.
ప్రస్తుతం డబ్బు లేదా పలుకుబడి ఉన్నవారు తప్ప, కరోనా బారిన పడిన సామాన్యులు జీవించడం లేదని, వారి పరిస్థితులు చాలా దారుణంగా ఉందని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కరోనా వైరస్ నుండి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి, సీయం జగన్ పెద్ద యుద్ధమే చేస్తున్నారని, ఈ క్రమంలో ఆయనకు బలాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాని ఉండవల్లి అన్నారు.