AP: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల కాలంలో రాజకీయాల గురించి తన విశ్లేషణలను తెలియజేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. ఇటీవల ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చే పార్టీ గురించి తన విశ్లేషణ తెలియజేశారు. 2024 ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన మూడు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వచ్చారు.
ఇక ఈ మూడు పార్టీలో అద్భుతమైన మెజారిటీ సొంతం చేసుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది అయితే కూటమి ప్రభుత్వం పై మెల్లమెల్లగా వ్యతిరేకత వస్తుందనే వాదన కూడా ఒకవైపు వినపడుతుంది ఇలాంటి తరుణంలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ తన విశ్లేషణను వెల్లడిస్తూ 2029 లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది కూడా తెలిపారు.
ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ…మరోసారి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని.. జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదని తేల్చేశారు. అయితే కూటమికి ఉన్న అనుకూలతలు, వ్యతిరేకతలు ఏవని ప్రశ్నిస్తే ఉండవల్లి నుంచి ఆసక్తికర సమాధానం వచ్చింది. తనకు అంత సబ్జెక్ట్ లేదని ఆయన తేల్చి చెప్పడం విశేషం. తద్వారా కూటమి ప్రభుత్వంపై ఈ ఏడాది పాలనలో ఏ విధమైనటువంటి వ్యతిరేకత లేదని చెప్పకనే చెప్పేశారు.
ఇలా జగన్ మోహన్ రెడ్డి ఇకపై తిరిగి అధికారంలోకి రారు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిజానికి ఈయన వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత విధేయత కలిగిన నేత. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఉండవల్లి అరుణ్ కుమార్. రెండుసార్లు రాజమండ్రి ఎంపీ కూడా అయ్యారు. ఇప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే తాను ఎంపీ అయినానని కృతజ్ఞతగా చెబుతుంటారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ వెంట వెళ్లకుండా ఏ పార్టీతోను సంబంధాలు లేకుండా రాజకీయాల గురించి విశ్లేషణలు చేస్తూ తన అభిప్రాయాలను తెలుపుతూ వార్తలలో నిలుస్తున్నారు.