తైవాన్ దేశం … చైనాకు తూర్పు వైపున చుట్టూ సముద్రంతో ఉండే దేశం. సైజు అంతా కలిపి ఉత్తరాంధ్ర అంత ఉంటుంది. ఆ దేశంలో ఇప్పుడో ప్రత్యేకమైన సమస్య తలెత్తింది. ప్రపంచం మొత్తం కరోనా సమస్యతో అతలాకుతలం అవుతుంటే… తైవాన్‌లో పేర్లు మార్చేసుకునే సమస్య జఠిలంగా మారింది. దీన్ని సాల్మాన్ గందరగోళం అని స్థానిక మీడియా పిలుస్తోంది. ఎందుకంటే గత రెండ్రోజుల్లో తమ పేర్లు మార్చమంటూ 150 మందికి పైగా… అధికారులకు అప్లికేషన్లు పెట్టుకున్నారు.
వారిలో చాలా మంది తమ పేరులో ఎక్కడో ఒక చోట గుయ్ యు (“gui yu”) అని చేర్చమంటున్నారు. గుయ్ యు అంటే సాల్మన్ అని అర్థం. ఇలా పేర్లు మార్చమని అడగటానికి ప్రధాన కారణం… అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న సుషీ రెస్టారెంట్లే. చైన్ రెస్టారెంట్లైన్ సుషీ రెస్టారంట్లు… 2 రోజుల ప్రమోషన్ ఆఫర్ ఒకటి తెచ్చాయి. దాని ప్రకారం… తమ పేరులో గుయ్ యు అనే పదం ఉన్నవారు… ఈ రెస్టారెంట్లలో ఫ్రీగా భోజనం చేయవచ్చు. వీరితోపాటూ… మరో ఐదుగుర్ని తీసుకురావచ్చు. అందరికీ ఫ్రీ మీల్సే. ఎంత కావాలంటే అంత తినొచ్చు.
ఈ విషయంపై స్పందించిన ప్రభుత్వం ఎవరైనా సరే మూడుసార్ల వరకూ పేరు మార్చుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది. అంతే, చాలా మంది కుర్రాళ్లు, ఈ ఆఫర్ అందుకోవడానికి రెడీ అయ్యారు. తమ పేరు మార్చేయమని కోరుతూ అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ఆ రెస్టారెంట్లు, ఇటు ప్రజలు అందరూ బాగానే ఉన్నారు కానీ, ప్రభుత్వ అధికారులకే కొత్త తలనొప్పి మొదలైంది. అప్లికేషన్లు అమాంతంగా పెరిగిపోతుంటే వేగంగా పేర్లు మార్చలేక నానా తంటాలు పడుతున్నారు.
ఇలాంటి అవసరానికి పేరు మార్చుకోవడం కరెక్టు కాదు. దీని వల్ల మాకు అనవసరమైన పేపర్ వర్క్ పెరిగిపోతోంది అని డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ చెన్ సుంగ్ యెన్ రిపోర్టర్లకు తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిస్థితిని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అని ఆయన తెలిపారు.చాలా మంది ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి… తాత్కాలికంగా పేరు మార్చమని అడుగుతున్నారు. ఆఫర్ ముగిశాక మళ్లీ వచ్చి తమ ఒరిజినల్ పేరును పెట్టేసుకుంటామని అంటున్నారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇలా ఆ చైన్ రెస్టారెంట్లు తెచ్చిన ప్రమోషన్ ఆఫర్ తైవాన్ ప్రభుత్వాధికారులకు తలనొప్పిగా మారాయి.