బ్రెజిల్-రష్యా-ఇండియా-చైనా-దక్షిణాఫ్రికా (బ్రిక్స్) సమూహంగా వర్చ్యువల్ గా జరిగిన 12వ బ్రిక్స్ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ… కొత్త ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని అమలు చేయాల్సిందిగా, ఉగ్రవాదులను దోషులుగా నిర్ధారించడానికి సహాయపడే మరియు మద్దతు ఇచ్చే దేశాలకు పిలుపునిచ్చారు.ఈ వేదికలో పాకిస్థాన్‌పైనా, అంతర్జాతీయ వ్యవస్థల తీరుపైనా మోదీ గర్జించారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలితోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలను సంస్కరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదం ప్రపంచంలో అతి పెద్ద సమస్య అని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే, నిధులు సమకూర్చే అన్ని దేశాలను జవాబుదారీ చేయాలన్నారు. మోదీ వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ సమర్థించారు.
పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఉగ్రవాదమని తెలిపారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే, సహాయపడే దేశాలను కూడా అపరాధులుగా ప్రకటించాలన్నారు. బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీని ఖరారు చేయడం గొప్ప విజయమని తెలిపారు. భారత దేశం వచ్చే సంవత్సరం బ్రిక్స్‌కు అధ్యక్షత వహిస్తుందని, ఈ కృషిని ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. ప్రపంచ జనాభాలో 42 శాతం బ్రిక్స్ దేశాల్లో ఉందని, కోవిడ్-19 మహమ్మారి అనంతరం ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో ఈ దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.