సిక్కింలో విషాదం….. గాలిలో కలిసిపోయిన 16 మంది ఆర్మీ జవాన్ల ప్రాణాలు!

బారత్ – చైనా సరిహద్దు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అనునిత్యం దేశ ప్రజల రక్షణ కోసం పాటు పడే జవాన్లు, వారి విధినిర్వహణ లో భాగంగా గస్తి కాయడానికి వెళుతున్న సమయంలో వారి ట్రక్ లోయలోకి పడిన ఘటనలో 16 మంది ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు, నలుగురు సిబ్బంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.

వివరాలలోకి వెళితే…. ఉదయం మూడు వాహనాల కాన్వాయ్ చటెన్ నుండి తంగూ వైపు బయలుదేరాయి. అయితే అందులోని ఒక ట్రక్ గేమా 3 ప్రాంతానికి రాగానే వాహనం మలుపు తిరుగుతూ వంతెన దగ్గర లోయలోకి పడిపోయింది. ఈ సంఘటన సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ కు 130 కి. మీ. దూరంలో ఉన్న లాచెన్ కు 15 కి. మీ. దూరంలో 23 వ తేదీన ఉదయం 8 గంటల ప్రాంతంలో సంభవించింది.

ఈ ప్రమాదంలో 16 మంది జవాన్లు మరణించారు. వీరిలో ముగ్గురు సీజేఓలు, 13 మంది జవాన్లు ఉన్నారు. కాగా మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ కాన్వాయ్ లో ఉన్న మిగిలిన జవాన్లు వారి హెడ్ క్వార్టర్స్ కు వెంటనే సమాచారం ఇవ్వడంతో… హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టిన ఆర్మీ అధికారులు క్షతగాత్రులను ఉత్తర బెంగాల్ లోని సైనిక ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాద ఘటన పై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. వీర జవాన్లు సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి అని, వారి సేవలు దేశ ప్రజలు మర్చిపోరని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన బాధిత కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.