Crime News: ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం లో మార్పులు, కలుషితమైన ఆహారపు పద్ధతుల వల్ల ఉన్నట్టుండి అస్వస్థతకు గురవుతున్నారు. అస్వస్థతకు గల కారణాలు తెలిసే లోపు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. తాజాగా ఇలాంటి విషాదకరమైన సంఘటన శ్రీకాళహస్తి మండలంలో చోటు చేసుకుంది. ఎల్లప్పుడూ పసిపిల్లల బోసి నవ్వులు,అల్లరి చేష్టలతో ఎంతో సందడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది.అతి తక్కువ సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
పశ్చిమబెంగాల్ రాష్ట్రం, మర్దన్ జిల్లా, ఆండాళ్ గ్రామానికి చెందిన రమేష్, నీలంకుమారి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు..కుమార్తె హీనాకుమారి(5), కుమారుడు రోషణ్‌కుమార్‌దాస్(2) ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం పొట్ట చేత పట్టుకొని పని కోసం రాచగున్నేరికి వచ్చి నివాసం ఉంటున్నారు.రమేష్ గ్రామ సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య ఇంటి వద్దనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటోంది. ఈ క్రమంలో అందరూ బుధవారం రాత్రి భోజనం చేసి నిద్రించారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో రమేష్ కుమార్తె హీనా అస్వస్థతకు గురికావడంతో కుమారుడిని పక్క ఇంట్లో వదిలిపెట్టి స్థానికుల సహాయంతో పాపను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుమార్తె మరణించిందని బాధతో పాప మృతదేహాన్ని ఇంటికి తీసుకు వచ్చే లోపు కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో తిరిగి బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా అతి తక్కువ సమయంలో ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు పిల్లలు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతంగా మారింది.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సంఘటనకు సంబంధించిన విషయాల గురించి విచారణ చేపట్టారు.పిల్లల మరణానికి గల కారణాల గురించి తెలియకుండానే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పోస్టుమార్టం జరపకుండా మరణ ధ్రువీకరణ పత్రాన్ని అందచేయడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు ఒత్తిడి చేయటం వల్ల వైద్యులు పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించారు.