కూటమిలో కుంపటి… శ్రీకాళహస్తిలో జనసేనను గిల్లిన టీడీపీ!

రెండు మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయంటే… వేదికలపై అధినేతలు ఆలింగనాలు చేసుకుంటే సరిపోదు. గ్రౌండ్ లెవెల్ లో కేడర్ కలిసి ఉండాలి.. ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలి. అలాకాకుండా ఒకరినొకరు గిల్లుకుంటే మొదటికే మోసం కన్ ఫాం అనే విషయం మరిచిపోకూడా. ప్రస్తుతం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పరిస్థితి అలానే ఉంది. ఆ టిక్కెట్ టీడీపీ ఖాతాలోకి వెళ్లడంతో వారు చేసిన రచ్చ ఇప్పుడు కూటమిలో కుంపటికి కారణమైందని తెలుస్తుంది!

టీడీపీ – జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించారు చంద్రబాబు. దీంతో… ఆ ఆనందమో.. లేక, గిల్లే కార్యక్రమమో తెలియదు కానీ… జనసేన ఇంచార్జ్ వినూత ఇంటివద్ద టీడీపీ క్యాడర్ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు! దీంతో… జనసేన క్యాడర్ ఫుల్ గా హర్ట్ అయిపోయారని తెలుస్తుంది. దీంతో… శ్రీహాళహస్తి టిక్కెట్ ఎట్టిపరిస్థితుల్లోనూ జనసేనకే ఇవ్వాలని.. గత ఐదేళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ఎంతో పోరాటం చేశారని జనసేన క్యాడర్ చెబుతున్నారు.

ఈ విషయంలో కూటమి పెద్దలు పునఃపరిశీలన చేయాలని, అలా కానిపక్షంలో ఇబ్బందులు తప్పవనే స్థాయిలో రిక్వస్ట్ లు, డిమాండ్ లు తెరపికి వస్తున్నాయని తెలుస్తుంది. ఇదే సమయంలో… కోట వినూతకు టికెట్ ఇవ్వాలని జనసేన పార్టీ క్యాడర్ రోజుకో రకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. దీంతో గ్రౌండ్ లెవెల్ లో టీడీపీ – జనసేన క్యాడర్ మధ్య గ్యాప్ పెరిగిపోతుందని.. అధినేతలు కల్పించుకోని పక్షంలో మొదటికే మోసం తప్పదని చెబుతున్నారట.

టీడీపీ, జనసేన మధ్య పరిస్థితి ఇలా ఉంటే… మరోపక్క బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా… బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కోలా ఆనంద్‎ కే టికెట్ అంటూ ఆ పార్టీ క్యాడర్ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో ఒక అడుగు ముందుకేసి ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేయాలని ఆ పార్టీ శ్రేణులు ప్రచారం కూడా చేసేస్తున్నాయి. ఒకటి రెండొ రోజుల్లో కోలా ఆనంద్ అభ్యర్థిత్వాన్ని కన్ ఫాం చేస్తూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా బీజేపీ శ్రేణులుల్ చెబుతుండటం గమనార్హం.

దీంతో… మూడు పార్టీల మధ్య గ్యాప్ మరింత పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయంలో అధినేతలు కల్పించుకుని బుజ్జగింపుల పర్వానికి తెర తీయని పక్షంలో… గ్రౌండ్ లెవెల్ లో సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని.. ఇది కాస్తా చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం కూడా లేకపోలేదని చెబుతున్నారంట.

కాగా… ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బియ్యపు మధుసూదన్‌ రెడ్డిని కన్ ఫాం చేసిన సంగతి తెలిసిందే. గడిచిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై బియ్యపు 38,141 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి వినూతకు 5,274 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ఆనంద్ కు 4,004 ఓట్లు పోలయ్యాయి.