Crime News: బతుకుదెరువులోనే కాకుండా మరణంలో కూడా వీడని అన్నదమ్ముల అనుబందం!

Crime News: నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం లో నష్టాలు రావడంతో, చేసిన అప్పులు తీర్చలేక అన్నదమ్ములు ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.పోలీసుల కథనం ప్రకారం… నల్లగొండ మండలం పెద్ద సూరారం కి చెందిన రామయ్య స్తానిక డీఈవో కార్యాలయంలో అటెండర్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. ఈయనకు ఇద్దరు కుమారులు మార్త శ్రీకాంత్ (43), వెంకన్న (35) లు ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లి అయ్యింది. మార్త శ్రీకాంత్ కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉండగా..వెంకన్నకు కూడా భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరు నల్లగొండ లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.

తండ్రి రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన సొమ్ముతో అన్నదమ్ములు ఇద్దరు కలసి బయట ఇంకా కొంచెం అప్పు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. శ్రీకాంత్ ఒక ప్రైవేట్ బ్యాంక్ లో పని చేస్తూ, తమ్ముడు వెంకన్న తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొదట్లో బాగా లాభాలు గడించిన ఇద్దరు, కరోన పరిస్థితుల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో అప్పుల ఊబిలోకి కూరుకు పోయారు. అప్పులు ఇచ్చిన వారు అప్పు చెల్లించమని ఒత్తిడి చేశారు. దీంతో శ్రీకాంత్ కలెక్టరేట్ సమీపంలో కొత్తగా నిర్మించిన ఇంటిని అమ్మి 60 లక్షల వరకు అప్పు చెల్లించాడు. ఇదే కాకుండా తన భార్య తరపు సంక్రమించిన ఒకటిన్నర ఎకరా పొలాన్ని అమ్మి కొన్ని అప్పులను తీర్చాడు.

అయినా సరే అప్పులు తీరకపోవడం, దాదాపు మూడు కోట్ల వరకు అప్పు, వాటి వడ్డీలు పెరగడంతో ఒత్తిడికి గురయ్యారు. అప్పు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి అధికమవడంతో మనోవేదనకు గురైన అన్నదమ్ములు ఇద్దరు, శ్రీకాంత్ ఉంటున్న అద్దె ఇంట్లోకి వెళ్లి చెరి ఒక రూము లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతసేపటికీ ఇంట్లో నుండి శబ్దం రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి ఓనర్ కిటికీలో నుండి చూడగా అన్నదమ్ములిద్దరూ విగత జీవులుగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.