వైవీ సుబ్బా రెడ్డి Vs విజయ సాయి రెడ్డి – టీటీడీ కేసు విషయంలో ఏమి జరుగుతుంది ??

YV Subba Reddy and Vijaya Sai Reddy

విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. వీరిద్దరూ జగన్‌కు రెండు కళ్లులాంటివారు. కానీ ఈ రెండు కళ్లకు పడదు. ఆధిపత్యం కోసం ఎప్పుడూ అంతర్గతంగా ఎత్తులు, పై ఎత్తులు వేసుకుంటూనే ఉంటారు. అది జగన్‌కూ తెలుసు. ఇప్పుడు లేటెస్ట్‌గా డెవలప్‌ అయిన ఒక పరిణామం వీరిద్దరి మధ్య సంబంధాలను ఓపెన్‌గా ఫోకస్‌ చేసింది.

YV Subba Reddy and Vijaya Sai Reddy
YV Subba Reddy and Vijaya Sai Reddy

తమ పరువు బజారుకు ఈడుస్తున్నారంటూ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డిపై టీటీడీ హైకోర్టులో పిటీషన్‌ వేసింది. 2018లో వేసిన ఈ పిటీషన్‌ ఇంకా విచారణలోనే ఉంది. ఈలోపు తెలుగుదేశం గద్దె దిగి అధికారం జగనన్న చేతిలోకి వచ్చింది. తన బాబాయి సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌ను చేశాడు. సహజంగానే తెలుగుదేశం హయాంలో తమ వాళ్లపై పెట్టిన కేసులు, వేసిన పిటీషన్లు ఉపసంహరించుకోవడం జరుగుతుంటుంది.

అందులోభాగంగానే విజయసాయిపై వేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. వెనువెంటనే దీనిపై రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. టీటీడీ పరువు తీసిన వాళ్లు అధికారంలో ఉన్నారని వదిలేస్తారా అంటూ చంద్రబాబు బ్యాచ్‌ హడావుడి మొదలుపెట్టింది. ఇలాంటి వాటిని జగన్‌ ఏమాత్రం పట్టించుకోడు. అసలు వాళ్లవైపే చూడడు. కానీ విచిత్రంగా ఈ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా రెస్పాండ్‌ అయ్యాడు.

విజయసాయిపై కేసును ఉపసంహరించుకోవడంలేదని, అది కొనసాగుతుందని టీటీడీ వివరణ ఇచ్చింది. టీటీడీలో జరిగే రాజకీయ నిర్ణయాలన్నీ వైవీ సుబ్బారెడ్డివే కదా. జగన్‌కు చెప్పకుండా ఆయన ఏ నిర్ణయం తీసుకోడు. అందులోనూ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా కోర్టులో నడుస్తున్న పిటీషన్‌ వ్యవహారం. కానీ తీసుకున్నాడు. వైఎస్సార్‌సీపీలో అంతర్గతంగా నడుస్తున్న చర్చ ఏంటంటే విజయసాయి, సుబ్బారెడ్డి మధ్య వచ్చిన విభేదాలే ఈ నిర్ణయానికి కారణమని. ఎంత విభేదాలున్న సొంత పార్టీలో నెంబర్‌–2 నాయకుడిపై కేసు నడుపుతారా అనే ప్రశ్నలకు టీటీడీ పరువు ప్రతిష్టలు, భక్తుల మనోభావాలు, రాజకీయంగా వచ్చే ఇబ్బందులను సుబ్బారెడ్డి లేవనెత్తారని, ఇక జగన్‌ మాట్లాడలేదనే ప్రచారం జరుగుతోంది. సుబ్బారెడ్డి లాజిక్‌కు విలువ ఇచ్చి విజయసాయిని కూడా దువ్వి.. కేసు కొనసాగినా నిర్ణయం మనకు వ్యతిరేకంగా రాదులే అని జగన్‌ సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. అయినా దీన్ని సాయిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు. తనకు వ్యతిరేకంగా సుబ్బారెడ్డి వేసిన స్కెచ్‌లో భాగంగానే ఇదంతా జరిగిందని విజయ సాయి రెడ్డి అనుమానం .

పైకి టీటీడీ పరువు, స్వతంత్రత అని ఏవేవో చెబుతున్నా లోతుగా చూస్తే ఇదంతా జగన్ కి తెలిసే జరుగుతుందా అని అనిపిస్తుంది. ఇది వరకు కొన్ని పత్రికల్లో వచ్చినట్టు విజయసాయి దూకుడు చాలాకాలం నుంచి జగన్‌కు నచ్చలేదట. ముఖ్యమైన అధికారులను సిండికేట్‌ చేసి తనకు అనుకూలంగా నడిపిస్తుండడం, విశాఖలో అంతా తానే అయి వ్యవహారాలు చేస్తుండడం తనకు మింగుడుపడడంలేదట. అయినా ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటె వారిమధ్య ఉన్న సంబంధాలు అలాంటివి మరి. అప్పటికీ ఒకసారి వైజాగ్‌ వెళుతున్నప్పుడు ఆయన్ను తన కారు దించేసి ఒక జర్క్‌ ఇచ్చాడు. కొద్దిరోజులు దూరం పెట్టాడు. కానీ ఎక్కువకాలం దూరం పెట్టలేకపోయాడు. ఎంత తన మనిషైనా విజయసాయిరెడ్డిని కొంత కంట్రోల్‌ చేయాలనే ఆలోచన జగన్‌లో ఎప్పటి నుంచో ఉందంటున్నారు. అందుకు ఇప్పుడు టైమ్‌ కుదిరింది. టీడీపీ టైమ్‌లో వేసిన కేసును ఉపసంహరించుకోకుండా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాడు. దీనివల్ల విజయసాయికి వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేకపోయినా ఆయన అధిపత్యానికి ఒక బ్రేకు వేసినట్లయింది. ముందుముందు ఈ వ్యవహారం ఏ రూటు తీసుకుంటుందో చూడాల్సిందే.