Vijaya Sai Reddy: వైసీపీ నుంచి నిష్క్రమించిన మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి గురించి తిరిగి చర్చలు వేడెక్కాయి. ఈ నెల మొదట్లో విజయవాడకు వచ్చిన ఆయన, లిక్కర్ స్కాం విచారణలో భాగంగా సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే, అదే సమయంలో టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్‌తో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారని చెబుతూ, దీనికి సంబంధించిన ఓ వీడియోను వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. దీన్ని ఆధారంగా చేసుకుని ఆయనపై టీడీపీకి “అమ్ముడు”పోయారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవలి ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీని వీడి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి, పార్టీపై ఎలాంటి విమర్శలు చేయకుండా తన రాజీనామాతో నిబద్ధత చూపించారు. రాజ్యసభ సీటు నుంచే కాదు, పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి కూడా నిష్క్రమించారని తెలిసిందే. ఆయన ఎవరితో కలుస్తారు, ఎవరిలో పాల్గొంటారు అన్నది ఇప్పుడు వ్యక్తిగత విషయమవుతుంది. పైగా, పార్టీని బ్లేమ్ చేయకుండా మౌనంగా వెళ్లిపోయిన నేతను, ఇప్పుడు తిరిగి విమర్శించడం ఎలాంటి న్యాయానికి చెల్లుతుంది? అనే ప్రశ్నను రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతున్నారు.
సాధారణంగా రాజకీయాలు అనేవి నిత్యం మారే సమీకరణలతో నడుస్తుంటాయి. మాజీ నేతగా సాయిరెడ్డి ఎవరి సాన్నిధ్యాన్ని కోరుకుంటారు, ఎవరిచేత భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటారు అనేది పూర్తిగా వారి స్వేచ్ఛ. ఒకప్పుడు పార్టీకి తలమానికంగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు వ్యక్తిగత దాడులకు దిగటం వల్ల, ప్రతిపక్షానికి బలమే చేకూరే అవకాశం ఉంది తప్ప, ప్రత్యర్థిని బలహీనపరచలేమనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులది. పైగా, ఆయన వ్యవహారం ఇప్పటి వరకూ నిక్కచ్చిగానే ఉందని అంతా చెబుతున్నారు. చివరగా, ఈ వివాదాన్ని మరింత పొడిగించడం వైసీపీకి మంచిది కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది.