వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం మొదలైంది. ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయసాయిరెడ్డికి నమ్మకంలేదని జగన్ అనడం, ఆయన చంద్రబాబు వైపుగా మొగ్గు చూపారని ఆరోపించడం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది.
వైసీపీకి తగినంత ఎమ్మెల్యేలు లేరని, రాజ్యసభలోకి తిరిగి వచ్చే అవకాశాలు లేకపోవచ్చని భావించి కూటమికి అనుకూలంగా ప్రవర్తించారని జగన్ వ్యాఖ్యానించారు. ఇందుకే చంద్రబాబుకు ఉపయోగపడేలా పని చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరహా వ్యక్తి చేసిన స్టేట్మెంట్‌కు ఏమాత్రం విలువ లేదని జగన్ స్పష్టం చేశారు.
ఇక లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో తన పార్టీ నేతలపై చేస్తున్న ఆరోపణలను కూడా జగన్ ఖండించారు. ముఖ్యంగా మిథున్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు. ‘‘సీఎంవోకు వచ్చిన ఒక ఫైల్ అయినా చూపించగలరా?’’ అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. కసిరెడ్డిని అప్రూవర్‌గా మారనందుకే నిందితుడిగా చేర్చారని ఆరోపించారు.
పోలీసు అధికారులపై కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని జగన్ ఆరోపించారు. కాంతి రాణా, జాషువా, విశాల్ గున్నిలను వేధిస్తున్నారని అన్నారు. ఇది రాజకీయ కక్షసాధింపు చర్యలేక తప్ప మరొకటి కాదని, అధికార వ్యవస్థను నిరుత్సాహ పరిచే చర్యలంటూ తీవ్ర విమర్శలు చేశారు. మొత్తం మీద, విజయసాయితో మొదలైన మాటల దాడి ఇప్పుడు అధికార వ్యాపార వ్యవహారాలపైకి విస్తరించడం గమనార్హం.