తులసి మొక్కను ఇలా పూజిస్తే దరిద్రం దరికి చేరదు.. లక్ష్మీ కటాక్షం మీదే..!

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఒక ఔషధ మొక్క మాత్రమే కాదు, దైవ స్వరూపంగా పూజించబడే పవిత్రమైనది. ప్రతి ఇంటిలో తులసి ఉండాలని పూర్వకాలం నుంచి నమ్మకం ఉంది. తులసి కోటతో కూడిన ఇల్లు చిన్న దేవాలయం వంటిదే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి తులసి పూజ చేసే వారు ఇంట్లో సానుకూల శక్తులు నిండి, చెడు శక్తులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయని విశ్వసిస్తారు.

పురాణాల్లోనూ తులసికి విశిష్టత చెప్పబడింది. శ్రీమహావిష్ణువు స్వయంగా “తులసి లేకుండా చేసే పూజ అసంపూర్ణం” అని ఆశీర్వదించారని పండితులు చెబుతుంటారు. అందువల్లే తులసిని విష్ణువు, లక్ష్మీ దేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. తులసిని భక్తితో పూజిస్తే సకల దేవతలకు పూజ చేసినట్లే ఫలితమిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంట్లో తులసి ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, సంపద, సంతోషం పెరుగుతాయని భక్తుల నమ్మకం.

అయితే తులసి ఆకులు కోసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. శాస్త్రం ప్రకారం ఆదివారం, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అమావాస్య, సంక్రాంతి, అలాగే గ్రహణ దినాల్లో తులసి ఆకులను తీయకూడదు. అంతేకాకుండా సూర్యోదయం కంటే ముందుగానీ, సూర్యాస్తమయం తరువాతగానీ ఆకులు కోయరాదు. ఈ నియమాలను విస్మరిస్తే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తులసిని మహిళలు కోయరాదని పూర్వపు నమ్మకాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం అది అనుమతించబడింది. ముఖ్యంగా పూజలు, యజ్ఞాలు, వ్రతాల కోసం అవసరమైతే తులసి ఆకులు తీసుకోవచ్చు. కానీ ఆ సమయంలోనూ నియమాలను పాటించాలి.

ఆధునిక శాస్త్రం ప్రకారం కూడా తులసి మహిమ అద్భుతం. ఇది వైద్య గుణాలు కలిగిన మొక్క. తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. దగ్గు, జలుబు, శ్వాస సమస్యలకు ఇది సహజమైన ఔషధంలా పనిచేస్తుంది. అందువల్లే మన పెద్దలు తులసిని ఇంట్లో పెంచి, దానికి పూజ చేయడం ఆచారంగా మార్చారు.

తులసి పూజ అనేది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఇది కేవలం మొక్కను పూజించడం కాదు, పవిత్రతను ఆహ్వానించడం. తులసిని గౌరవంగా పూజిస్తే ఇంట్లో సంతోషం, సంపద, ఆరోగ్యం నిలవడమే కాకుండా, దైవ అనుగ్రహం ఎల్లప్పుడూ వుంటుందని భక్తులు విశ్వసిస్తున్నారు. తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా దైవస్వరూపంగా చూసి పూజించడం మన సంప్రదాయాల మహిమ. అందుకే ఇళ్లలో తులసి ఉండటం ఒక శుభలక్షణం అని తరతరాలుగా మన పెద్దలు చెప్పి వచ్చారు. ఈ పవిత్ర మొక్కను పూజించి, దానికి సంబంధించిన నియమాలు పాటిస్తే జీవితం సంతోషంగా.. సంపూర్ణంగా సాగుతుందని శాస్త్రాలు మంత్రిస్తున్నాయి.