ఈ సెక్యూరిటీ ఫీచర్ తో స్పామ్ కాల్స్ కి చెక్ పెట్టండిలా…?

ప్రస్తుత కాలంలో చేతిలో ఫోన్ ఉంటే చాలు ఏ పనైనా చిటికెలో చేయవచ్చు. ముఖ్యంగా ఏ పని చేయటానికైనా ముందుగా మన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా ఫోన్ నెంబర్ డీటెయిల్స్ తప్పకుండా అడుగుతారు. ఇలా ప్రతి విషయానికి ఫోన్ నెంబర్ షేర్ చేయడం వల్ల కొందరు మన ఫోన్ నంబర్స్ ని మిస్ యూస్ చేసి స్పామ్ కాల్స్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ స్పామ్‌ కాల్స్‌లో ముఖ్యంగా టెలీమార్కెటింగ్‌ కాల్స్‌, రోబో కాల్స్‌, స్పామ్‌ కాల్స్‌ అని మూడు రకాలు ఉంటాయి.

ఇలా కొందరు స్పామ్‌ కాల్స్‌ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ వారిని మోసం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పర్సనల్ లోన్స్ జాబ్ ఆఫర్స్ అంటూ రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టి వారి నుండి డబ్బులు కాజేస్తూ ఉంటారు. వీటి గురించి తెలియని కొందరు వ్యక్తులు మొత్తం సమాచారాన్ని అందటం వల్ల చాలా నష్టపోతున్నారు. అయితే ఇలాంటి స్పామ్ కాల్స్ రాకుండా అరికట్టటానికి ఆండ్రాయిడ్ ఒక సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ సెక్యూరిటీ ఫీచర్ లో భాగంగా కాలర్ ఐడి, స్పామ్ ప్రొటెక్షన్ అనే రెండు ఫీచర్లను వినియోగదారులకు గూగుల్ అందిస్తోంది.

స్పామ్ కాల్స్ రాకుండా ఉండటానికి ముందుగా మీరు ఫోన్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి..ఆ తరువాత కుడివైపు పైన మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి. అక్కడున్న కాలర్‌ ఐడీ అండ్ స్పామ్‌ ప్రొటెక్షన్ అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకొని..దాన్ని ఎనేబుల్ నొక్కాలి. ఆ తరువాత అగ్రీ బటన్‌పై క్లిక్ చేస్తే కాలర్‌ ఐడీ అండ్‌ స్పామ్‌ ప్రొటెక్షన్ ఫోన్‌లో యాక్టివేట్ అవుతుంది.

అలాగే స్పామ్ కాల్స్ వచ్చిన నంబర్ బ్లాక్ చేయటానికి ఫోన్‌ యాప్‌ ఓపెన్‌ చేసి కింద ఉన్న రీసెంట్స్‌ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు వచ్చిన స్పామ్‌ కాల్‌ నంబర్‌పై క్లిక్ చేసి ఫోన్‌, మెసేజ్‌, వీడియో, ఐ అని కనిపిస్తున్న ఐకాన్స్‌ లో.. ఐ ఐకాన్‌పై క్లిక్ చేస్తే బ్లాక్‌, రిపోర్ట్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. స్పామ్‌ కాల్‌ వచ్చిన నంబర్‌ను బ్లాక్ చేయాలంటే బ్లాక్‌ ఆప్షన్‌పై, సదరు నంబరుపై రిపోర్ట్ చేయాలంటే రిపోర్టు ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, ఆ నంబర్ నుంచి మీకు మరోసారి ఫోన్‌కాల్స్‌ అనేవి రావు.