టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ: ఎవరి సొమ్ములు ఎవరు దోచేస్తున్నారు.?

తెలంగాణ రాష్ట్రం ఆరున్నరేళ్ళలో కేంద్రానికి 2.72 లక్షల కోట్లు ఇచ్చిందట. అదే సమయంలో కేంద్రం, రాష్ట్రానికి 1.42 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందట. ఇది నిజం కాకపోతే, తాను రాజీనామా చేస్తానంటున్నారు తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు. నిజానికి ఈ లెక్కల్ని పెద్దగా తప్పు పట్టాల్సిన పనిలేదు. తెలంగాణ ధనిక రాష్ట్రం.. ఆ ధనిక రాష్ట్రం నుంచి కేంద్రానికి నిధులు వెళతాయి. అన్ని రాష్ట్రాల నుంచీ అంతే. నిజానికి, అసలు లెక్క వేరే వుంది. కేంద్రం పన్నులు, రాష్ట్రం పన్నులు.. ఈ లెక్కన కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిన పన్నుల వాటా అన్నమాట. మరి, రాష్ట్రం నుంచి తీసుకుంటున్నప్పుడు రాష్ట్రానికి, కేంద్రం ఇవ్వాలి కదా.? అలా ఇచ్చే క్రమంలో దాదాపు సగం సొమ్ము కేంద్రం, ఇతర రాష్ట్రాలకు వెచ్చిస్తోందన్నది తెలంగాణ మంత్రి కేటీయార్ ఆరోపణ. దేశం అన్నాక.. అన్నీ ధనిక రాష్ట్రాలే వుండవు. కొన్ని పేద రాష్ట్రాలు కూడా వుంటాయి.. ఆంధ్రప్రదేశ్ తరహాలో.

నిజానికి, ఆంధ్రప్రదేశ్‌కి సైతం కేంద్రం ఇతోదికంగా ఏమీ సాయం చేసేయడంలేదు. రాష్ట్రానికి రావాల్సిన చాలా వ్యవహారాల్లో కేంద్రం కోతలు పెడుతోంది. అసలు దక్షిణాది రాష్ట్రాలంటేనే కేంద్రానికి చులకన. ఇది ఎప్పటినుంచో నడుస్తున్న వ్యవహారమే. ఇక, బీజేపీ.. తెలంగాణ రాష్ట్ర సమితి విమర్శలకు మామూలుగా అయితే కౌంటర్ ఇచ్చే స్థితిలో వుండకపోవచ్చు. రాజకీయాల్లో రాజకీయ విమర్శలే వుంటాయి గనుక, అడ్డగోలు రాజకీయ విమర్శలతో బీజేపీ ఎదురుదాడి చేయడం ఖాయం. అంతే తప్ప, తెలంగాణ బీజేపీ నేతలు, తెలంగాణ రాష్ట్రం తరఫున మాట్లాడతారని అనుకోలేం. ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ నాయకులు, తమ రాష్ట్రం తరఫున కేంద్రాన్ని నిలదీయలేరు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, వెనుక బడిన జిల్లాలకు దక్కాల్సిన ఆర్థిక ప్యాకేజీ.. ఇలాంటివాటిపై ఏపీ బీజేపీ నేతలకు నోరు పెగలదు. బీజేపీ అంటేనే అంత.