మేయర్ పీఠానికి దూరంగా తెరాస..? కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ktr kcr

 గ్రేటర్ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్ట పడినట్లు తయారైంది తెరాస పార్టీ పరిస్థితి. గతంలో ఉన్న 99 స్థానాల నుండి 55 స్థానాలకు పడిపోయింది. దీనితో సొంతగా మేయర్ పీఠం దక్కించుకోవాలనే ఆశకు గండి పడింది. ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు ద్వారా కూడా తెరాస కు సరైన మెజారిటీ రావటం లేదు. మేయర్ పీఠం దక్కాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం మద్దతు అవసరం.

ktr

 దీనితో తెరాస పార్టీ తీవ్ర ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. అవసరం అయితే మేయర్ పీఠానికి దూరంగా ఉండటమే మంచిది అనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా కేటీఆర్ మాటలు వింటే అదే అర్ధం అవుతుంది. తెలంగాణ భవన్ కు గెలిచిన కార్పొరేటర్లను.. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను ఆహ్వానించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

 అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. అనధికారికంగా బయటకు వచ్చిన సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మేయర్ ఎన్నికను ఏం చేద్దామని గెలిచిన కార్పొరేటర్లను కేటీఆర్ అడగ్గా.. పలువురు స్పందించినట్లు తెలుస్తోంది. బలం లేదన్న మాటను కొందరు కార్పొరేటర్లు ప్రస్తావించగా.. వారి మాటల్ని విన్న కేటీఆర్ అనూహ్యంగా స్పందించినట్లు సమాచారం.

 మెజారిటీ లేనప్పుడు మద్దతు అడగటం ఎందుకు? బద్నాం కావటం ఎందుకు? ఏం జరుగుతుందో చూద్దాం? అన్న మాట ఆయన నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే అవకాశం లేకపోతె మేయర్ పీఠానికి దూరంగా ఉండటమే మంచిదనే అభిప్రాయం తెరాస అగ్ర నేతల్లో కనిపిస్తుంది. మజ్లీస్ తో పొత్తు పెట్టుకొని మేయర్ అయితే బీజేపీ కి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికే తెరాస మజ్లీస్ ఒకటే అంటూ బీజేపీ ప్రచారం చేస్తుంది. ఇలాంటి సమయంలో మజ్లీస్ పొత్తు తెరాస కు నష్టం కలిగించే అవకాశం ఉంది.

 మరికొద్ది నెలల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కనుక బీజేపీ గెలిస్తే ఇక తెరాస పార్టీకి కోలుకొని ఎదురుదెబ్బ తగిలినట్లే, ఆందుకే ఇలాంటి సమయంలో బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని కారుపార్టీ భావిస్తుంది. ఆందుకే మేయర్ పీఠం కోసం ఎలాంటి రాజకీయాలు చేయకుండా, పొత్తులు పెట్టుకోకుండా ఉండటమే ప్రస్తుతం అన్ని విధాలా మంచిదనే ఆలోచనకు గులాబీ అధినేత వచ్చినట్లు తెలుస్తుంది. దాని ఫలితమే కేటీఆర్ నోటి నుండి అలాంటి మాటలు వచ్చాయని భావించాలి .