నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు రాష్ర్టంలో రోజురోజుకి హీటెక్కిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్-విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం హద్దు మీరుతోంది. ఇరు పార్టీలు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. తాజాగా అధికార పార్టీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మంత్రులు, విప్ లు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాని కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పిస్తామని స్థానిక ప్రజా ప్రతినిధులతో బేరసారాలు చేస్తున్నారని..లొంగకపోతే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ వివాదానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసారు
ఇప్పటికే ఈ తరహా విమర్శలు బీజేపీ చేసింది. తాజాగా ఆ వరుసలో కాంగ్రెస్ చేరడంతో వాతావరణ మరింత వేడెక్కింది. వాటికి టీఆర్ ఎస్ కౌంటర్ వేసింది. ఇది ఆపరేషన్ ఆకర్ష్ కాదు…అభివృద్ది ఆకర్ష్ అంటూ మండిపడింది. దేశంలో పార్టీ ఫిరాయింపులకు కర్త, కర్మ, క్రియ బీజేపీ అని టీఆర్ ఎస్ ఆరోపించింది. ఈ ఉప ఎన్నికలో తమ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత గెలపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. 824 మంది ఓరట్లలో 80 శాతం తమ పార్టీ వైపే ఉన్నారని ఇది ప్రతిపక్షాలు రాసిపెట్టుకోవాల్సిన విషయమని ఎద్దేవా చేసారు. ప్రజల ఒత్తిడితో స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీలు మారుతున్నారని..ఇది అభివృద్ది ఆకర్ష్ అని టీఆర్ ఎస్ చెప్పుకొచ్చింది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను ఈసీ 45 రోజుల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈనెల 29 వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. అటుపై పరిస్థితులను సమీక్షించాల్సి ఉంటుంది. కేసుల తగ్గుముఖం పడితే యధావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయని లేని పక్షంలో మళ్లీ లాక్ డౌన్ విధించిన ఆశ్చర్యపోనవసరం లేదని కేసీఆర్ ఇప్పటికే హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వం చెప్పినట్లు చేస్తేనే వైరస్ ని తరిమికొట్టగలమని లేదంటే? పరిస్థితులు ఇంతకన్నా దారుణంగా ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారు.