రాష్ట్రంలో కరోనా కాస్త విరామం తీసుకుంటున్న సమయంలో, ఆ విషయాన్ని మరచిపోయేలా దుబ్బాక లో నవంబర్ మూడవ తారీకున ఉప ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిందన్న సంగతి తెలిసిందే.. ఇన్నాళ్లూ కరోనా భయంతో ఇంటికే పరిమితమైన దుబ్బాక ప్రజలకు ఈ ఎన్నికలు కాస్త ఆటవిడుపుగా దరికి చేరాయి.. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం దుబ్బాక టీ ఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఆ స్దానం భర్తీ అయ్యింది.. దీంతో ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించవలసిన పరిస్దితి ఏర్పడింది..
ఈ నేపధ్యంలో మరోసారి దుబ్బాకలో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడించాలని టీఆర్ఎస్ అగ్రనేతలంతా ప్రయత్నిస్తున్నారట. ఈ దశలో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ కూడా శరవేగంగా పావులు కదుపుతోందని తెలుస్తుంది.. కాగా ఇప్పటి వరకు విజయ గంట మోగిస్తూ వస్తున్న కేసిఆర్ ఈ ఎన్నికల విషయంలో తెగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ ఉపఎన్నికల బాధ్యతను మేనల్లుడు హరీష్ రావుకి అప్పగించినట్లు సమాచారం.. ఇదిలా ఉండగా దుబ్బాకలో సీనియర్ నాయకులు అయినా రఘునందన్ రావు బిజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన ఈయన ఓటమి చెందడంతో ప్రజల్లో ఈయనపై సానుభూతి ఉందట..
ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత కు టికెట్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ దాదాపుగా సిద్ధం అయ్యింది. కానీ టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకుడు చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారట.. అయితే గత ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పెద్దలు కీలక పదవిని ఇస్తానని తన తండ్రికి వాగ్దానం చేశారు.. కానీ ఆ మాట నెరవేర్చలేదు కాబట్టి ఈ ఎన్నికల్లో తనకు తప్పని సరిగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన గట్టి పట్టు పడుతున్నారట..
ఈ క్రమంలో గులాభి అధినేత తనను పక్కన పెట్టితే మాత్రం రెబల్ గా పోటీ చేయాలని ముందుగా భావించినా, ప్రస్తుతం కమళం నుండి ఆయనకు ఆఫర్లు వస్తుండటంతో దుబ్బాక రాజకీయం ఊహించని విధంగా యూ టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయట.. అయితే దుబ్బాకలో గెలుపు ఓటములను నిర్ణయించేది శ్రీనివాస్ రెడ్డి వర్గం కావడంతో ఆయనను వదులుకోకూడదని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుందట.. దీంతో టీఆర్ఎస్ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయట.. ఇక ఇప్పటి వరకు అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి సారిగా ఈ ఎన్నికలు గులాభి బాస్ కేసియార్‌ను టెన్షన్ పెడుతున్నట్టుగా పార్టీ వర్గాల్లో అనుకుంటున్నారట..