వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తే ఓట్లు పడతాయా.? అదీ తెలంగాణలో.! 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ పని చేశారు. వైఎస్సార్ హయాంలో తెరపైకొచ్చిన సంక్షేమ పథకాల్లో చాలా పథకాలు ఇప్పటికీ అమల్లో వున్నాయి. అందులో ఆరోగ్యశ్రీ అత్యంత ముఖ్యమైనది.
ఆరోగ్యశ్రీ గురించి ఇప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ గొప్పగా చెబుతుంటారు. ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ పథకం కూడా అంతే. అలాంటిది, రాజశేఖర్ రెడ్డి మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలెలా చేయగలుగుతున్నారు.? రాజకీయం అంటేనే అంత. ఆయన జీవించి వున్న కాలంలో.. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో చేసే విమర్శల్ని రాజకీయ విమర్శలుగా లైట్ తీసుకోవచ్చేమో.
కానీ, ఇప్పుడు.. రాజశేఖర్ రెడ్డి మరణించి చాలా ఏళ్ళయ్యాక.. ఇప్పటికీ ఆయన్ని నర రూప రాక్షసుడనీ, నీళ్ళ దొంగ అనీ విమర్శించడం ఎంతవరకు సబబు.? వైఎస్సార్ మీద విమర్శలు చేస్తే తాము పెద్ద నాయకులమవుతామనే భ్రమల్లో బహుశా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు వున్నారని అనుకోవాలేమో.
ఆంధ్రపదేశ్ రాష్ట్రంతో నీటి వివాదాలుంటే.. ఉన్నత స్థాయిలో చర్చించి పరిష్కరించుకోవచ్చు. లేదంటే, అక్కడి అధికార పార్టీ.. ఇక్కడి అధికార పార్టీ.. రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు.
అంతే తప్ప, రాజశేఖర్ రెడ్డి పేరుని వివాదాల్లోకి లాగడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. వైఎస్సార్ కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్న దరిమిలా, ఆమెను రాజకీయంగా ఇరకాటంలో పడేయాలన్న కుత్సిత బుద్ధి తప్ప.. నీటి ప్రాజెక్టులపై సోకాల్డ్ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు చిత్తశుద్ధి వుందని అనుకోలేం.
ఏడేళ్ళలో ఆయా కొత్త ప్రాజెక్టుల గురించి కనీస ఆలోచన చేయని టీఆర్ఎస్, ఇప్పుడు ఆగమేఘాల మీద శ్రీశైలం ఎగువన ప్రాజెక్టు నిర్మించాలనుకోవడం కుట్రపూరిత రాజకీయం కాక మరేమిటి.?