చీరాలలో ట్రయాంగిల్… ఆమె కష్టం మరొకరికి రాకూడదు

ycp

 ప్రకాశం జిల్లా రాజకీయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. ముఖ్యంగా చీరాల నియోజకవర్గ రాజకీయాలు హాట్ హాట్ టాపిక్ అయ్యింది. గత ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీచేసి టీడీపీ నేత కరణం బలరాం చేతిలో ఓడిపోయిన ఆమంచికి, ఎన్నికల తర్వాత టీడీపీకి బై బై చెప్పేసి వైసీపీ కి మద్దతు ఇస్తున్న కరణం బలరాంకు పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే ఒకరిమీద మరొకరు దాడులు చేసుకొనే వరకు వచ్చింది.

MLC post to Pothula Sunitha

 ఇలాంటి సమయంలో చీరాల అంటే ఆమంచి, కరణం మాత్రమే కాదు, నేను కూడా ఉన్నానంటూ దూసుకొచ్చింది పోతుల సునీత.. టీడీపీ ఎమ్మెల్సీగా ఉంటున్న పోతుల సునీత ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ జెండా కప్పుకుంది. రాజధాని బిల్లులకు ఆమోద ముద్ర వేసుకోవాలన్న ఆతృతలో మండలిలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించిన వైసీపీకి.. పోతుల సునీత చిక్కారు. ఆమె కూడా చీరాల సీటుపై ఆశలు పెట్టుకున్నారని తాజాగా వెల్లడయింది.

 తాజాగా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాలు చీరాల నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఇలా వేటపాలెం మండలంలోని ఓ గ్రామంలో కూడా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమంచి రాలేదు కానీ.. పోతుల సునీత వచ్చారు. వేదికపైన మరో వైసీపీ నేత పాలేటి రామారావు.. కరణంను ఆకాశానికెత్తేసారు. అంతే కాదు.. కరణం బలరాంను 2024లోనూ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.దీంతో పోతుల సునీతకు కాలిపోయింది. తాను ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి వచ్చానని.. తనకు అన్యాయం జరుగుతోందని అనుకున్నారు. 2024 సంగతి ఇప్పుడెందుకని.. కరణంనే గెలిపించాలని చెప్పడానికి ఆయనెవరని వాగ్వాదానికి దిగింది. తనకు టీడీపీలోనూ అన్యాయం చేశారని.. ఇప్పుడు వైసీపీలోనూ అదే చేస్తున్నారని అన్నారు.

 ఆమె అంతగా ఆవేదన చెందటానికి కారణం లేకపోలేదు పోతుల సునీత టీడీపీ తరపున పోటీ చేసి ఆమంచి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు. ఆమంచి పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు.. ఆమంచి పార్టీ మారడంతో తనకే టిక్కెట్ అనుకున్నారు. కానీ పర్చూరులో గొట్టిపాటి రవికి టిక్కెట్ ఇవ్వడంతో కరణంకు చీరాలలో టిక్కెట్ సర్దుబాటు చేశారు. ఆయన గెలిచేశారు. దాంతో.. తన టిక్కెట్ కరణం వల్లే పోయిందని ఆమె అనుకున్నారు. ఇప్పుడు ఆమె చేరిన తర్వాత కరణం కూడా వైసీపీలో చేరారు. ఇప్పుడు.. తనకు టిక్కెట్ దక్కదని ఆమె ఆవేదన చెందుతున్నారు.

 ఇక తాజాగా ఆమె వైఖరి చూస్తే వచ్చే ఎన్నికల నాటికీ చీరాల టిక్కెట్ మీద ఆమె కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు సృష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఆమంచి కృష్ణ మోహన్, కరణం బలరాం నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు సునీత కూడా పోటీకి రావటం ఆసక్తి కలిగించే పరిణామం. ఇక్కడ విశేషం ఏమిటంటే గతంలో ఈ ముగ్గురు కూడా టీడీపీ లోనే పనిచేశారు , ఇప్పుడు కూడా ముగ్గురు వైసీపీ లోనే పనిచేస్తున్నారు.