వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న విషయం విదితమే. ఖమ్మంలో ఈ మేరకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు షర్మిల. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో బహిరంగ సభకు కొన్ని పరిమితులు విధించినప్పటికీ, కనీ వినీ ఎరుగని స్థాయిలో సభ నిర్వహించాలనే ఆలోచనతో వున్నారు నిర్వాహకులు.
సోషల్ మీడియాలో షర్మిల పార్టీ గురించిన ప్రచారం జోరుగా సాగుతోంది. మరోపక్క, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అసలు షర్మిల పార్టీ వైపు చూసేదెవరు.? అని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మొదట్లో ఎద్దేవా చేసిందిగానీ, ఇప్పుడు కాస్త ఉలిక్కిపడుతోంది. ఎవరెవరు షర్మిల పార్టీ వైపు వెళ్ళే అవకాశం వుంది.? అనే విషయమై ఆరా తీస్తోందట గులాబీ పార్టీ.
నిజానికి, తెలంగాణలో గులాబీ పార్టీకి గట్టిగా ఎదురొడ్డి నిలిచే పార్టీ ఏదీ లేదనే చెప్పాలి. బీజేపీ ఘీంకరిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కాస్తో కూస్తో హడావిడి చేస్తున్నా.. అవన్నీ గాలివాటం వ్యవహారాలేనన్న అభిప్రాయం ఇప్పటిదాకా టీఆర్ఎస్ శ్రేణుల్లో వుంది. కానీ, షర్మిలకి ఓ వర్గం ఓటు బ్యాంకు అండగా వుండే అవకాశాలున్న నేపథ్యంలో ఖచ్చితంగా తమకు ఆ పార్టీ నుంచి ‘థ్రెట్’ వుంటుందనే చర్చ కింది స్థాయి టీఆర్ఎస్ నేతల్లో జరుగుతోంది.
ఓ మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు షర్మిల వైపు చూస్తున్నారనీ, ‘మతం’ కోణంతోపాటు, ‘సామాజిక వర్గ కోణం’ కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఏడాది లోపే షర్మిల పార్టీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మార్చేయొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికార టీఆర్ఎస్‌కి మిత్రపక్షమైన మజ్లిస్ కూడా షర్మిల పార్టీ పట్ల సానుకూలంగా వ్యవహరించే అవకాశాల్లేకపోలేదు. కాగా, రేపటి షర్మిల పార్టీ బహిరంగ సభలో, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ (షర్మిల తల్లి) షర్మిల పార్టీ పేరుని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.