Tollywood Movies: కరోనా కారణంగా తెలుగు సినీ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిక్యూటివ్స్ రెండు సంవత్సరాలుగా చాలా నష్టపోయారు. అఖండ సినిమాతో సినీ పరిశ్రమకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది అనుకునేలోపే థర్డ్ వేవ్ వచ్చింది. దాంతో పెద్ద సినిమాల రిలీజ్ ఆగిపోవడమే కాకుండా, ఇప్పటికీ పూర్తయిన సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పుడివ్వాలో తెలియని స్థితి ఏర్పడింది. అయితే ఇటీవల మళ్లీ కరోనా కేసుల తగ్గుముఖంతో పెద్ద సినిమాల రిలీజ్‌పై ఒక క్లారిటీ వచ్చిందని ఫిలింనగర్ టాక్.
ఇక వివరాల్లోకి వెళ్లితే జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మొదటగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినా, భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసినా కూడా కరోనా దెబ్బతో మళ్లీ వాయిదా పడింది. కరోనా పరిస్థితులను బట్టి మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తామని మూవీ టీం ప్రకటించింది. కానీ తాజా ప్రకటన ప్రకారం మార్చి 25న విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర ఆచార్య. రామ్ చరణ్ కీలకపాత్ర పోషించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉండగా, ఇది కూడా కరోనా కారణంగా ఏప్రిల్ 1కి వాయిదా పడింది. అయితే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో ఈ సినిమా ఏప్రిల్ 29కి వాయిదా పడింది.
కాగా పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల మల్టీస్టారర్ బీమ్లా నాయక్ సినిమాపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఫిబ్రవరి 25లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామంటూ చిత్ర బృందం ప్రకటించింది. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కాంబినేషన్లో వచ్చిన ఎఫ్3 రిలీజ్ డేట్‌పైన కూడా క్యారిటీ ఇచ్చారు మూవీ టీం. అయితే ఎప్పుడో జనవరిలో అనుకొని వాయిదా పడిన ఈ సినిమా, ప్రస్తుతమున్న వరుస సినిమాలతో రిలీజ్ డేట్‌ను ఏప్రిల్ 29గా కరారు చేశారు. ఇదిలా ఉండగా మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట కూడా సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా అది ప్రస్తుత కారణాల వల్ల మరింత వెనక్కి వెళ్లి మే 12గా నిర్ణయించారు చిత్ర బృందం. ఇదే కాదు వరుణ్ సందేశ్ హీరోగా నటించిన గని సినిమాపైన కూడా క్లారిటీ రాలేదు. అయితే తాజా ప్రకటన ప్రకారం ఈ మూవీ ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న విడుదల అవుతుందని సమాచారం.
ఇక ఇదే బాటలో ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా కూడా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు రెండు వారాల ముందు మార్చి 11న రిలీజ్ చేసేందుకు మూవీ టీం సమాయత్తం అవుతోంది. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా కూడా ఆగష్టు 25 విడుదలకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.