‘దేవర’ సిరీస్.! కొరటాల శివపై పెరుగుతున్న అనుమానాలు.!

ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన సినిమా, అక్టోబర్ నాటికి వెళ్ళిపోవడమేంటబ్బా.? ఓ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడాల్సి వస్తే, ఓ నెల రోజులు, రెండు నెలలు వెనక్కి వెళ్ళడం వరకూ ఓకే. కానీ, ఏకంగా ఎనిమిది నెలల గ్యాప్ అంటే చిన్న విషయం కాదు కదా.?

వీఎఫ్ఎక్స్ కోసం సమయం పడుతుందన్నది అర్థం చేసుకోవాల్సిన విషయమే. కానీ, అన్నీ పక్కాగా జరుగుతున్నాయని ముందే చెప్పారు కదా.! సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డంతోనే ఆలస్యమా.? అంటే, అదీ సరైన రీజన్ కాదన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.

హీరో జూనియర్ ఎన్టీయార్ వైపు నుంచి ఆలస్యం ఏమీ వుండదు. అవసరమైతే, రాత్రీ పగలూ సినిమా కోసం కష్టపడగల స్టామినా వున్నోడు. బడ్జెట్ సమస్యలు అసలే లేవు. మరి, సమస్య ఏంటి.?

ఇంకేముంది.? దర్శకుడు కొరటాల దగ్గరే సమస్య అంతా.! ‘ఆచార్య’ సినిమాని చెక్కీ చెక్కీ.. చివరికి ఏం చేశాడో చూశాం. సర్లే, అది కోవిడ్ కష్ట కాలం.. అని సరిపెట్టుకోవచ్చు. ‘ఆచార్య’ తర్వాత కూడా తిరిగి తన పూర్వపు కాన్ఫిడెన్స్‌ని కొరటాల శివ సంపాదించుకోలేకపోయాడన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.

‘దేవర’ అనుకున్న విధంగా రావట్లేదనీ, రీషూట్స్ బాగానే జరపాల్సి వస్తోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తాలూకు సారాంశం. ‘పుష్ప-2’ గనుక ఆలస్యమైతే, ‘దేవర’ అక్టోబర్‌లో కూడా విడుదలవకపోవచ్చన్న ప్రచారం ఏదైతే వుందో. ‘దేవర’లోని డొల్లతనాన్ని బయటపెడుతోంది.