నాడు వైయ‌స్సార్ పై.. నేడు జ‌గ‌న్ పై ఆయ‌న గుస్సా!

కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి కేటాయింపును మించి ఎక్కువ నీటిని ఎత్తిపోత‌ల ద్వారా త‌ర‌లించాల‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు మర్రి శ‌శిధ‌ర్ రెడ్డి ఆరోపించారు. ఇలా చేస్తే తెలంగాణ‌లో ప్రాజెక్టుల‌కు తీవ్ర నీటి క‌ట‌క‌ట ఏర్ప‌డుతుందని విమ‌ర్శించారు. ఈ ప్ర‌య‌త్నాల్ని అడ్డుకోవాల్సిందిగా శశిధ‌ర్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కి సూచించ‌డం హాట్ టాపిక్ గా మారింది.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి సుమారు 7 టిఎంసి అడుగుల నీటిని ఎత్తిపోత‌ల ద్వారా త‌ర‌లించాల‌ని ఇటీవల ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుండి 7 టిఎంసిఎఫ్.. సంగమేశ్వరం నుండి ప్రతి రోజు 3 టిఎంసిలు నీటిని ఎత్తిపోత‌ల ద్వారా త‌ర‌లించేందుకు సాధ్య‌మ‌వుతుందని వెల్ల‌డించారు.

2004 లో పోతిరెడ్డిపాడు హెచ్‌ఆర్ ప్రారంభించినప్పుడు దానిని వ్యతిరేకిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి, ..దివంగత సిఎం వైయస్ఆర్ పైనా ఇదే తీరుగా ఎదురు తిరిగారు. ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 11,000 నుండి 40,000 క్యూసెక్కులకు పెంచాలని ప్ర‌‌భుత్వం ప్రతిపాదించినప్పుడు ప్రభుత్వంతో పోరాడారు. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 40,000 నుండి 80,000 క్యూసెక్కుల‌ వరకు రెట్టింపు చేస్తున్నామని ఎపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గత డిసెంబర్‌లో చెప్పినట్లు తాజాగా ఆయన గుర్తు చేశారు. 2005 లో వైయ‌స్సార్ నిర్ణ‌యం తెలంగాణ‌కు డ్యామేజ్ చేసింద‌ని.. ఇప్పుడు జ‌గ‌న్ నిర్ణ‌యం అలాంటిదేన‌ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. 24 గంటల్లో 8 టిఎంసిల నీటిని త‌ర‌లిస్తే 12 రోజుల్లో 100 టిఎంసి నీరు ఏపీకి త‌ర‌లిపోతుంద‌ని అన్నారు.

పోతిరెడ్డిపాడు నుండి ఎక్కువ నీరును ఎత్తిపోత‌ల ద్వారా త‌ర‌లించేందుకు వీలుగా 2004 లో ఎమ్‌డిడిఎల్‌ను వైయస్ఆర్ ప్రభుత్వం 854 అడుగులకు పెంచింది. హెడ్ ​​రెగ్యులేటర్ సామర్థ్యాన్ని మళ్లీ పెంచితే ఆంధ్రప్రదేశ్ ఇప్ప‌టి కంటే ఎక్కువ నీటిని తీసుకెళ్ల‌గలదని, ఇది తెలంగాణకు భరోసా ఇచ్చిన నీటిని కోల్పోయిన‌ట్టేన‌ని శశిధర్ రెడ్డి అన్నారు.

తెలంగాణ నీటిపారుదల ప్రయోజనాల కోసం కృష్ణ నదిపై నిర్మిస్తున్న జూరాల ఇతర ప్రాజెక్టులు ఎటువంటి భరోసా లేక‌ నష్టపోతాయని, ఇది మహాబుబ్‌నగర్ మరియు నల్గొండ జిల్లాలను ఎండిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు. సిఎం కెసిఆర్ ఈ విషయంపై ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆయన ఆశ్చర్యపోయారు. రెండు తెలుగు రాష్ట్రాలు కరోనావైరస్ సమస్యలపై దృష్టి సారిస్తుండగా, కృష్ణ నీటిని కొల్లగొట్టడానికి ఎపీ ప్రభుత్వం యోచిస్తోందని ఆయన ఆరోపించారు.

అయితే వైయ‌స్ రాజశేఖర్ రెడ్డికి మర్రి చెన్నారెడ్డికి అప్ప‌ట్లో సరిపడేది కాదు.. అయితే ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి కొడుకు రాజశేఖర్ రెడ్డి కొడుకు జ‌గ‌న్ పైనా విమర్శలు చేస్తూ ప్రాజెక్టుల‌కు అడ్డు ప‌డ‌డంపై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అప్పుడు తండ్రికి ఇప్పుడు కొడుక్కి ఆయ‌న అలా అడ్డుప‌డుతున్నార‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.